హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ సునీల్ బన్సల్ రాష్ట్రంలో నిర్వహించిన కీలక సమావేశానికి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు . రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, జాతీయ స్థాయి కమిటీ వంటి అంశాలపై స్టేట్ ఆఫీసులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సంబంధించిన పలు అంశాలపై సునిల్ బన్సల్ ఆరా తీశారు.
ఉపఎన్నికలో పార్టీకి ఎదురవుతున్న సవాళ్లు, నేతల మధ్య కోఆర్డినేషన్ వంటి అంశాలపై ఆయన చర్చించినట్లు తెలిసింది. ఇప్పటి వరకు ప్రచారం జరిగిన తీరు, అనుసరించాల్సిన వ్యూహంపైనా డిస్కషన్ జరిగినట్లు తెలిసింది. అయితే, ఈ సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది.
సమావేశానికి రాని వారిలో కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీలు ధర్మపురి అర్వింద్, కొండా విశ్వేశ్వర రెడ్డి ఉన్నారు. అలాగే, ఎమ్మెల్యేల్లో పైడి రాకేశ్ రెడ్డి, కాటిపల్లి వెంకటరమణా రెడ్డి, పాల్వాయి హరీశ్ బాబు, రామారావు పటేల్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి రాలేదు. ముందస్తు షెడ్యూల్ కారణంగానే వారు హాజరవ్వలేకపోయారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ కొందరు కావాలనే హాజరుకాలేదని బీజేపీ నేతలే చర్చించుకుంటున్నారు. కాగా, ఈ నెల 31న సర్దార్ పటేల్ విగ్రహం వద్ద రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం చేపట్టాలని..నవంబర్ 1 నుంచి 25 వరకూ సర్దారు – 150 కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్ గౌడ్ పేర్కొన్నారు.
