జానా రెడ్డి ఔట్ డేటెడ్ వ్యక్తి.. కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండూ ఒకటే..

జానా రెడ్డి ఔట్ డేటెడ్ వ్యక్తి.. కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండూ ఒకటే..

నాగార్జున‌సాగర్ ఉపఎన్నికలో సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ అభ్యర్థి తరుపున ప్రచారంలో పాల్గొన్నారు. త్రిపురారం మండలం, పెద్ద దేవులపల్లి‌లో ఆయన రోడ్ షో నిర్వహించారు. ‘ఇక్కడి ప్రజలు ఇంకా కలుషిత నీటినే తాగాల్సిన దుస్థితి ఉంది. ఈ ఎన్నికల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఈ రెండు పార్టీలకు ఏమాత్రం తేడా లేదు. కాంగ్రెస్‌లో గెలిస్తే మళ్ళీ టీఆర్ఎస్‌లోకే వెళ్తారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా.. టీఆర్ఎస్ పార్టీకి ఓటేసినా రెండూ ఒకటే. తెలంగాణలో కుటుంబ పెత్తనం సాగుతోంది. ఒకటి ఓవైసీ కుటుంబమైతే.. మరొకటి కేసీఆర్ కుటుంబం. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు బుద్ది చెప్పాలని సాగర్ ప్రజలను కోరుతున్నాను. రాష్ట్రాన్ని టీఆర్ఎస్ అప్పుల కుప్పగా మార్చింది. అప్పు అభివృద్ధి కోసం చేయాలి కానీ.. కుటుంబం బాగు కోసం చేస్తున్నారు. మోదీ ప్రధాని అయిన తరువాత కరెంట్ కొరత, ఎరువుల కొరత లేదు. రైతులకు, పొదుపు సంఘాలకు కేంద్రం నిధులు ఇస్తుంది. కరోనా నియంత్రణకు కేంద్రం ఉచితంగా కరోనా టీకా ఇస్తుంది. ప్రపంచంలో కోట్లాదిమంది కరోనాతో ఇబ్బంది పడుతుంటే.. పెద్దన్నగా బీజేపీ కరోనా టీకా అందిస్తుంది. సాగర్ బీజేపీ అభ్యర్థి, పేద కుటుంబానికి చెందిన రవిని గెలిపించాలి. ఇప్పుడు కాకపోయినా.. ముందు ముందు టీఆర్ఎస్ పాలన పోయి బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ  చైతన్యవంతంగా ముందుకు రావాలి. ఈ రాష్ట్రంలో కేసీఆర్‌కు, కేసీఆర్ కొడుకు, కూతురు, బంధువులకు మాత్రమే న్యాయం జరిగింది. సామాన్య మానవునికి అన్యాయం జరిగింది. జానా రెడ్డి ఔట్ డేటెడ్ వ్యక్తి. టీఆర్ఎస్‌కు బీ టీం కాంగ్రెస్ పార్టీ. గతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటేస్తే గెలిచిన ఎమ్మెల్యేలు ఎంత మంది ఆ పార్టీలో ఉన్నారో జానా రెడ్డి చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ త్వరలోనే రాష్ట్రంలో కనుమరుగయ్యే పార్టీ’ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.