కాళేశ్వరం అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ ఎందుకు కోరుతలే? : ఎంపీ లక్ష్మణ్

కాళేశ్వరం అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ ఎందుకు కోరుతలే? :  ఎంపీ లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ జరపాలని పీసీసీ చీఫ్ హోదాలో డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి.. సీఎం అయ్యాక ఎందుకు నోరు మెదపడం లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు. ‘‘ప్రజాధనాన్ని దోచుకున్నారని బీఆర్ఎస్ పై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలు.. ఆ డబ్బును నిజంగానే కక్కిస్తారా? లేక దీన్ని సాకుగా చూపి బీఆర్ఎస్ ను లొంగదీసుకుంటారా?”అని ఆయన ప్రశ్నించారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో లక్ష్మణ్​ మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు అఖిల పక్షంతో వెళ్తామన్న కాంగ్రెస్.. మంత్రుల వరకే ఎందుకు పరిమితం చేసిందని నిలదీశారు. తమ బండారం ఎక్కడ బయట పడుతుందోనని భయపడిన గత బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం లోపాలను దాచిపెట్టిందన్నారు. 

మేడిగడ్డ ప్రాజెక్టు నష్టాలకు బాధ్యులెవరని ఆయన రాష్ట్ర సర్కార్ పై మండిపడ్డారు. కాళేశ్వరం నిర్వహణ భారంతో దాని భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆరోపించారు. కాళేశ్వరం అవినీతిని కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నదిగా చూపించడానికి ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. అధికారంలోకి వచ్చి నెల రోజులు అవుతున్నా.. మేడిగడ్డ ఘటనలో ఎందుకు చర్యలు తీసుకోలేకపోతోందని ప్రశ్నించారు. అవినీతికి పాల్పడ్డ అధికారులతోనే డ్యాంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పించడం దేనికి సంకేతమన్నారు. బీఆర్ఎస్ దారిలోనే కాంగ్రెస్ వెళ్తోందని, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి వ్యవహారంలో ఆ రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందనే అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. ఇప్పటికైనా సీబీఐ విచారణను కోరాలని డిమాండ్​ చేశారు.