మజ్లిస్ను కేసీఆర్ పెంచి పోషిస్తుండు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్

మజ్లిస్ను కేసీఆర్ పెంచి పోషిస్తుండు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్

హైదరాబాద్: మజ్లిస్ను సీఎం కేసీఆర్ పెంచి పోషిస్తున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. కేసీఆర్ అండతోనే మజ్లిస్ నాయకులు దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. శనివారం మలక్ పేటకు చెందిన టీఆర్ఎస్ నాయకులు ఎంపీ లక్ష్మణ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కేసీఆర్, ఎంఐఎంపై విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్, ఎంఐఎం మైత్రి విడదీయరానిదంటూ ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలపై ఎంఐఎం వాళ్లు దాడులకు తెగబడుతున్నారని, కానీ కేసీఆర్ మాత్రం ఇవేమీ పట్టించుకోరని తెలిపారు. అందుకే ఇక్కడి టీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరుతున్నారని లక్ష్మణ్ చెప్పారు. ఎంఐఎం అంటే కేసీఆర్ కు భయమని, అందుకే వాళ్లు ఏం చేసినా చూస్తూ ఊరుకుంటారని విమర్శించారు.

దమ్ముంటే పాత బస్తీలో పన్నులు వసూలు చేయాలని కేసీఆర్ కు సవాల్ విసిరారు. ఎంఐఎం పార్టీని ఎదుర్కొనే దమ్మున్న ఒకే ఒక పార్టీ బీజేపీ అని పేర్కొన్న లక్ష్మణ్... మజ్లిస్ ఆగడాలను ఏమాత్రం సహించేది లేదంటూ హెచ్చరించారు. చిట్ చాట్ అంటూ కేటీఆర్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పై చవకబారు వ్యాఖ్యలు చేశారని ఆయన మండిపడ్డారు. మోహన్ భగవత్ కాలి గోటికి కూడా కేటీఆర్ సరిపోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన సాహసాలు, త్యాగాల ముందు మీరెంతా అంటూ కేటీఆర్ ను ప్రశ్నించారు. బీఆర్ఎస్ పేరుతో దేశాన్ని దోచుకోవడానికి కేసీఆర్ బయలుదేరారని, కానీ ఆయన ఆటలు జాతీయ స్థాయిలో సాగబోవని లక్ష్మణ్ స్పష్టం చేశారు.