అవసరం తీరాక బయటకు నెట్టేస్తడు.. సీఎం కేసీఆర్ పై వివేక్ ఫైర్

అవసరం తీరాక బయటకు నెట్టేస్తడు.. సీఎం కేసీఆర్ పై వివేక్ ఫైర్

మునుగోడు: సీఎం కేసీఆర్ తన అవసరం కోసం ఏమైనా చేస్తడని, అవసరం తీరాక ఎంతటి వారినైనా బయటకు నెట్టేస్తడని మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. శనివారం మునుగోడులో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి తరఫున వివేక్  ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై  ఆయన విరుచుకుపడ్డారు. ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్ కు ప్రజలు, ఉద్యమకారులు గుర్తుకు వస్తారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సీఎం అయ్యాక తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఎందరో ఉద్యమకారులను పార్టీ నుంచి బయటకు పంపించారని గుర్తుచేశారు. ఈటల రాజేందర్ లాంటి చాలామందిని కేసీఆర్ రాజకీయంగా వాడుకుని వదిలేశారని ఫైర్ అయ్యారు. అయితే ఈటలకు బీజేపీ అండగా నిలిచిందని చెప్పారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ ను ఓడించడానికి కేసీఆర్ ఎన్నో కుట్రలు పన్నారని, ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేశారని ఆరోపించారు. హుజూరాబాద్ లో కేసీఆర్ అధికార దుర్వినియోగానికి ప్రయత్నిస్తే అడ్డుకున్నామని..  పార్టీ కార్యకర్తలు, నాయకుల కృషి ప్రజల అండదండలతో ఈటల రాజేందర్ ను గెలిపించుకున్నామని వివేక్ గుర్తు చేశారు.

రాజగోపాల్ అనుచరులను కొనాలని కేసీఆర్ ప్రయత్నిస్తుండు

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులను కొనుగోలు చేయడానికి సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. కానీ రాజగోపాల్ రెడ్డి అనుచరులు కేసీఆర్ మాయలో పడే పరిస్థితిలో లేరని తేల్చి చెప్పారు. అధికారం, డబ్బు బలంతో ప్రతిపక్ష నాయకులను కేసీఆర్ కొంటున్నారని, అయితే ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ మాటలను నమ్మి మోసపోవద్దని నాయకులను కోరారు. మునుగోడు ప్రజల అభివృద్ధి కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ కు బుద్ధి చెప్పేలా మునుగోడు ప్రజలు భారీ మెజారిటీతో రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని వివేక్ వెంకటస్వామి కోరారు.