గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర లక్ష్మీకాంత్ పటేల్‌ను బీజేపీ ఎంపిక చేసింది. ఆయన పేరును కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అధికారికంగా ప్రకటించారు. నిన్న మధ్యాహ్నం సడన్‌గా సీఎం విజయ్ రూపానీ తన పదవికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ జోషి, బీజేపీ జనరల్ సెక్రెటరీ తరుణ్ చుగ్ తదితర నేతలు గుజరాత్‌లో మకాం వేశారు. ఎట్టకేలకు పలు సమావేశాల అనంతరం బీజేపీ సీనియర్ నేత, గుజరాత్‌లో ఆ పార్టీకి ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న భూపేంద్ర లక్ష్మీకాంత్ పటేల్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ప్రస్తుతం ఆయన ఘట్లోడియా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో ఆయన అహ్మదాబాద్ప మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గానూ, అహ్మదాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. భూపేంద్ర లక్ష్మీకాంత్ రేపే సీఎంగా ప్రమాణం చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
దాదాపు 15 నెలల పదవీకాలం మిగిలి ఉండగానే శనివారం మధ్యాహ్నం హఠాత్తుగా విజయ్ రూపానీ సీఎం పదవికి రాజీనామా చేశారు. అయితే వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర నాయకత్వం ఈ రకమైన నిర్ణయం తీసుకోవడంతోనే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేకు గోల్డెన్ చాన్స్..
అయితే విజయ్ రూపానీ రాజీనామా తర్వాత సీఎం రేసులో ఉన్నారంటూ పలువురి పేర్లు వినిపించాయి. కేంద్రమంత్రులు మన్సుఖ్ మాండవీయ, పరుషోత్తమ్ రూపాలా, స్టేట్ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, బీజేపీ స్టేట్ చీఫ్ సీఆర్ పాటిల్, పార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గోర్ధన్ జడాఫియా, రాష్ట్ర మంత్రి ఆర్ సీ ఫాల్దూ పేర్లు ప్రధానంగా ప్రచారంలోకి వచ్చాయి. కానీ వీరందరినీ కాదని సడన్‌గా ఆ అవకాశం భూపేంద్ర పటేల్‌కు రావడం విశేషం. ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన అసెంబ్లీలో ఉన్న వ్యక్తిగా ఆయనకు సీఎం పదవి రావడం గోల్డెన్ చాన్స్ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
