తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్

తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్

ఉత్తరప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల్లో గెలుపుతో జోష్​లో ఉన్న బీజేపీ.. తెలంగాణలోనూ అధికారంలోకి రావడంపై సీరియస్ గా దృష్టిపెట్టింది. ఈ దిశగా కొందరు రాష్ట్ర బీజేపీ సీనియర్లకు హైకమాండ్ నుంచి స్పష్టమైన ఆదేశాలు అందాయి. రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనపై జనంలో వ్యతిరేకత పెరుగుతోందని, దీనికితోడు కేంద్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరి కూడా కలిసొచ్చే అంశాలుగా బీజేపీ భావిస్తోంది. దీంతో రాష్ట్రంలో గెలుపు ప్లానింగ్ తో పాటు బలమైన అభ్యర్థులపైనా ఫోకస్ పెట్టింది.

  • నాలుగు రాష్ట్రాల్లో విజయంతో బీజేపీలో జోష్ 
  • ఈసారి పాగా వేయాలని నేతలకు టార్గెట్ 
  • సెగ్మెంట్లలో గెలుపు గుర్రాల కోసం వేట
  • టీఆర్ఎస్ అసంతృప్తులు, కాంగ్రెస్ లీడర్లపైనా దృష్టి 

హైదరాబాద్, వెలుగు: కీలకమైన యూపీతో పాటు మరో మూడు రాష్ట్రాల్లో ఎదురులేకుండా మళ్లీ అధికారంలోకి రావడం రాష్ట్ర బీజేపీలోనూ ఉత్సాహం నింపింది. ప్రధానమంత్రి మోడీ నాయకత్వం వల్లే ఈ ఘన విజయం సాధ్యమైందని, రాష్ట్రంలోనూ అదే జరుగుతుందని లీడర్లు ధీమాగా చెబుతున్నారు. మరోవైపు తెలంగాణలో పరిస్థితులు, మూడేండ్లలో బీజేపీకి వరుసగా దక్కిన విజయాల వల్ల అదే జోష్ లో ఇక్కడా పని మొదలుపెట్టాలని హైకమాండ్ నేత ఒకరు రాష్ట్ర బీజేపీ సీనియర్ నేతకు ఫోన్​లో చెప్పారు. కలిసొచ్చే అంశాలతో పాటు సెగ్మెంట్లలో బలమైన అభ్యర్థులను ఎంచుకోవడమే పార్టీ గెలుపుకు కీలకం అవుతుందని ఆ లీడర్ చెప్పారు. ఇందులో భాగంగా కనీసం వంద సీట్లలో సమర్థులైన లీడర్లు కావాలన్న చర్చ పార్టీలో మొదలైంది. అధికారంలోకి రావాలంటే అన్ని సెగ్మెంట్లలో గెలుపు గుర్రాలుండాలని, ఇప్పటికే ఢిల్లీ పెద్దలు రాష్ట్ర కమిటీకి సూచించారు. ఏ సెగ్మెంట్లో పార్టీకి బలమైన క్యాండిడేట్స్ ఉన్నారు? ఎక్కడ లేరు? అక్కడ బలమైన లీడర్లు ఎవరు? అన్న అంశాలపై పూర్తిస్థాయిలో కసరత్తు చేయాలని ఆదేశించారు.

ప్రస్తుతం రాష్ట్ర బీజేపీకి 30 నుంచి 40 సీట్లలో బలమైన అభ్యర్థులు ఉన్నారు. మిగతా సీట్లలో ఏం చేయాలన్న అంశంపై పార్టీ నేతలు దృష్టిపెట్టారు. ఓవైపు అధికారం, మరోవైపు భారీగా ఖర్చుకు సిద్ధమై రంగంలోకి దిగే టీఆర్ఎస్ ను ఎదుర్కోవడానికి మోడీ చరిష్మాతో పాటు ఇక్కడ జనంలో ఆదరణ ఉన్న బలమైన అభ్యర్థులు కావాలని పార్టీ సీనియర్ నేత ఒకరు అన్నారు. కొంతకాలంగా రాష్ట్రంలో నిర్వహించిన వేర్వేరు సర్వేల్లో చాలా సెగ్మెంట్లలో బీజేపీకి ఆదరణ పెరుగుతున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే మొత్తంగా పార్టీకి ఆదరణ పెరుగుతున్నా సెగ్మెంట్లలో గుర్తింపు ఉన్న లీడర్ల విషయంలో కొంత వెనుకబడినట్లుగా సర్వేలు అంచనా వేస్తున్నాయి. ఈ విషయాన్ని పార్టీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. పార్టీ హైకమాండ్ ఆదేశాల తర్వాత ఈ అంశంపైనే ప్రధానంగా దృష్టిపెట్టాల్సి ఉందని వారు చెబుతున్నారు. కొన్ని సీట్లలో పార్టీ నాయకుల్ని తయారు చేసుకోవడంతో పాటు టీఆర్ఎస్ లో గౌరవం లేక అసంతృప్తితో ఉన్న లీడర్లు, అటు కాంగ్రెస్ లో సొంత బలం ఉన్న లీడర్లపైనా ఫోకస్ పెడుతున్నారు. వారిని పార్టీలోకి ఆహ్వానించాలని భావిస్తున్నారు. అధికార పార్టీలో ఉన్న అసమ్మతి, ఇటీవల జరిగిన అన్ని రాష్ట్రాల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పరాజయంతో ఆ పార్టీ నేతల్లో ఉన్న నిరాశకు తోడు బీజేపీకి పెరుగుతున్న ఆదరణ కూడా వారిని ఆకర్షిస్తుందని చెబుతున్నారు. 

మలుపు తిప్పిన హుజూరాబాద్.. 
రాష్ట్రంలో టీఆర్ఎస్ వరుసగా రెండోసారి అధికారంలో ఉంది. మొత్తం 119 సీట్లకు గాను గెలిచినవాళ్లు, తర్వాత కలుపుకున్నవాళ్లు కలిపి వందమందికి పైగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్నారు. సిట్టింగ్ లతో పాటు ప్రభుత్వంపై జనంలో ఉన్న అసంతృప్తిని, వ్యతిరేకతను అనుకూలంగా మలచుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. లోక్ సభ ఎన్నికల తర్వాత దుబ్బాక ఉప ఎన్నికలో ప్రభుత్వంపై వ్యతిరేకతతో పాటు రఘునందన్ బలమైన అభ్యర్థి కావడం పార్టీని గెలిపించింది. గ్రేటర్ హైదరాబాద్ లో మంచి ఫలితాలు రావడం పార్టీలో ఉత్సాహం నింపింది. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నిక జరిగిన తీరు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీసింది. ముందుముందు జరగబోయే ఎన్నికలు ఎట్లా ఉంటాయన్నది హుజూరాబాద్ కళ్లకు కట్టింది. ప్రభుత్వం అధికారాన్ని అన్ని రకాలుగా వాడుకోవడంతో పాటు వేల కోట్ల రూపాయలను కుమ్మరించడం, రెండుమూడు నెలల పాటు ఓటర్లను ప్రలోభాలతో ఉక్కిరిబిక్కిరి చేయడం, చివరి క్షణంలోనూ ఓటుకు రూ.10 వేల వరకు డబ్బు పంచిన తీరు దేశం మొత్తాన్ని ఆకర్షించింది. హుజూరాబాద్ లో బీజేపీ బలం అంతగా లేకున్నా, అభ్యర్థి బలం కలిసి రావడం పార్టీని గెలిపించింది. హోరాహోరీగా జరిగిన పోరులో అంచనాలకు మించి పార్టీకి భారీ మెజారిటీ కూడా వచ్చింది. దీంతో ప్రలోభాలను తట్టుకుంటూ, టీఆర్ఎస్ ను దీటుగా ఎదుర్కోవాలంటే బలమైన అభ్యర్థులు అవసరమన్న అభిప్రాయానికి పార్టీ హైకమాండ్ వచ్చింది. ఇదే విషయాన్ని రాష్ట్ర నేతలకు చెబుతోంది. పార్టీ ఆదరణకు తోడు బలమైన అభ్యర్థులు కూడా రెడీ అయితే తెలంగాణలో పాగా వేయటం తమకు ఈజీ అని భావిస్తోంది.

సమన్వయం అవసరం.. 
అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే సీటు గెలుచుకున్న బీజేపీ.. ఆ తర్వాత జరిగిన రెండు ఉప ఎన్నికల్లో గెలిచి, ఎమ్మెల్యేల సంఖ్యను మూడుకు పెంచుకుంది. 2014లో బీజేపీకి బండారు దత్తాత్రేయ ఒక్కరే ఎంపీగా ఉన్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో నలుగురు ఎంపీలకు పెరిగారు. ఆ తర్వాత పార్టీ నిర్మాణంపైనా హైకమాండ్ దృష్టిపెట్టింది. పలువురు సీనియర్ల చేరికతో మరింత బలపడింది. ఇప్పుడు గెలుపు లక్ష్యంగా సాగుతున్న పార్టీలో బలమైన అభ్యర్థుల ఎంపిక, చేరికలతో పాటు లీడర్ల మధ్య సమన్వయం కూడా అవసరమని సీనియర్ నేత ఒకరు అన్నారు.