పార్టీ లైన్​ దాటితే ఉపేక్షించేది లేదు : కోర్ కమిటీ భేటీలో నడ్డా

పార్టీ లైన్​ దాటితే ఉపేక్షించేది లేదు : కోర్ కమిటీ భేటీలో నడ్డా

పార్టీ లైన్​ దాటితే ఉపేక్షించేది లేదు

కోర్ కమిటీ భేటీలో నడ్డా

హైదరాబాద్, వెలుగు : పార్టీ లైన్​ను​ ఎవరు దాటినా ఉపేక్షించేది లేదని బీజేపీ జాతీయ​ అధ్యక్షుడు జేపీ నడ్డా హెచ్చరించారు. పార్టీ విషయాలపై లీకులు ఇచ్చినా, నోరు జారినా సహించేది లేదన్నారు. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టాలని సూచించారు. బీఆర్ఎస్, బీజేపీ ఎప్పుడు ఒక్కటికావని, ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలని ఆదేశించారు. పదకొండు రాష్ట్రాల పార్టీ అధ్యక్షుల సమావేశం అనంతరం శంషాబాద్ నోవాటెల్​లో బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ మీటింగ్​ జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్​రెడ్డి నియమితులయ్యాక ఆయన అధ్యక్షతన జరిగిన మొదటి సమావేశం ఇది. ఇందులో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా,  పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్​చార్జ్​ప్రకాశ్ జవదేకర్, సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, అరవింద్ మీనన్ , ఈటల రాజేందర్, లక్ష్మణ్, బండి సంజయ్, వివేక్ వెంకటస్వామి, డీకే అరుణ, విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. 

రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, నాయకత్వ మార్పు అనంతర పరిణామాలపై ఇందులో ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. నిత్యం ప్రజల్లో ఉండాలని, వారి సమస్యలపై పోరాడాలని దిశానిర్దేశం చేశారు. ఎన్నికల కోసం వంద రోజుల యాక్షన్​ ప్లాన్​ రెడీ చేసుకోవాలని చెప్పారు. కాగా, సోమవారం బీజేపీ ఆఫీస్ బేరర్స్ మీటింగ్  జరుగనుంది. ఇందులో ప్రజా సమస్యలపై ఓ కార్యాచరణ రూపొందించనున్నారు.