కేటీఆర్ లో ఫ్రస్టేషన్ స్పష్టంగా కనపడుతోంది : వివేక్ వెంకటస్వామి

కేటీఆర్ లో ఫ్రస్టేషన్ స్పష్టంగా కనపడుతోంది : వివేక్ వెంకటస్వామి

అరెస్ట్ తప్పదనే మహిళా రిజర్వేషన్ బిల్లు తెరపైకి తెచ్చారు 
బీజేపీలో చేరిన సిరిసిల్ల బీఆర్ఎస్ ముఖ్యనాయకులు, కార్యకర్తలు
మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ పై మండిపడ్డ వివేక్ వెంకటస్వామి

 
వెలుగు న్యూస్ పేపర్, V6 న్యూస్ చానెల్ పై ఐటీశాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) తన అక్కసు, అసహనాన్ని ప్రదర్శించడాన్ని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు జీ. వివేక్ వెంకటస్వామి (Vivek Venkataswamy) తప్పుపట్టారు. ప్రెస్ మీట్ లో మంత్రి కేటీఆర్ ఫ్రస్టేషన్ స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ అంటే రాష్ట్ర ప్రజలకు విరక్తి కలుగుతోందని చెప్పారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ (CM KCR) అంటే కుటుంబ పాలన అని, కుటుంబ పాలన అంటే కేసీఆర్ అన్నట్లుగా రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. మంత్రి కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్ల నుంచి బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతల (irisilla BRS Leaders)తో పాటు చాలామంది కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో జీ. వివేక్ వెంకటస్వామి మాట్లాడారు. 

రాష్ట్రంలో అవినీతి పాలన, కుటుంబ పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని జీ. వివేక్ వెంకటస్వామి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలని చూస్తున్నారని అన్నారు. ఇంకా చాలా మంది BRS నేతలు, కార్యకర్తలు బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని తెలిపారు. ఇంతకుముందు బీఆర్ఎస్ కు చెందిన పలువురు ప్రజాప్రతినిధులను విచారణ సంస్థలు దర్యాప్తు చేశాయని, అప్పుడు మంత్రి కేటీఆర్ ఏం మాట్లాడలేదన్నారు. ఇప్పుడు తన చెల్లెలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha),ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణ చేస్తున్నారనే మాట్లాడుతున్నారని చెప్పారు. తాను అరెస్ట్ అవుతుందన్న విషయం తెలిసే ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్షకు ఎమ్మెల్సీ కవిత ప్లాన్ చేశారని వ్యాఖ్యానించారు. 

కేసీఆర్ (CM KCR) అవినీతిని రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. గతంలో జరిగిన ఉప ఎన్నికల సమయంలో కేసీఆర్ పై ప్రజలు ఎంత వ్యతిరేకతతో ఉన్నారో అందరూ చూశారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తోందని, ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. కల్వకుంట్ల కుటుంబాన్ని గద్దె దించే వరకూ బీజేపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. కరప్షన్ జరిగిన చోట తప్పనిసరిగా సీబీఐ, ఈడీ (CBI,ED) సంస్థలు దర్యాప్తు చేస్తాయని అన్నారు.