- ఎన్నికల కోసమే మహాత్ముడి పేరు వాడుకున్నరు: రాంచందర్ రావు
- పాత విజన్ పని చేయడం లేదని రాహుల్ గాంధీనే ఒప్పుకున్నరు
- అసెంబ్లీ తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ‘వీబీ జీ రామ్ జీ’ చట్టంపై తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. మహాత్మా గాంధీ పేరు ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ మొసలి కన్నీళ్లు కారుస్తోందని.. గాంధీపై కాంగ్రెస్ ది దొంగ ప్రేమ అని.. వారిదంతా రాజకీయ డ్రామా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు పెట్టడం వెనుక కాంగ్రెస్ కుట్రపూరిత రాజకీయాలు ఉన్నాయని రాంచందర్ రావు చెప్పారు. కొత్త చట్టం ద్వారా గ్రామీణ భారతం నిజంగా వికసిస్తుందని ఆయన పేర్కొన్నారు. "దేశంలో ఉపాధి హామీ పథకాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది.
1989లో జవహర్ రోజ్ గార్ యోజన, 1999లో జవహర్ గ్రామ సమృద్ధి యోజన, 2005లో ఎన్ఆర్ఈజీఏ పేర్లతో పథకాలు నడిచాయి. అప్పుడెప్పుడూ కాంగ్రెస్ కు గాంధీ గుర్తుకు రాలేదు. కానీ, 2009 ఎన్నికల ముందు ఓట్ల కోసం అకస్మాత్తుగా బాపూజీని గుర్తుచేసుకొని పథకానికి ‘మహాత్మా గాంధీ’ పేరు తగిలించారు. దీన్ని బట్టే గాంధీపై వాళ్లకున్నది గౌరవం కాదని.. కేవలం ఓట్ల యావ అని అర్థమవుతోంది" అని రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంఎన్ఆర్ఈజీఏపై కాంగ్రెస్ నేతలు ఇప్పుడు నీతులు వల్లిస్తున్నారని.. కానీ, వారి నాయకుడు రాహుల్ గాంధీనే ఆ పథకం విఫలమైందని గతంలో ఒప్పుకున్నారని ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ, ‘వీబీ జీ రామ్ జీ’ చట్టం ద్వారా పేదలకు భరోసా ఇస్తూ గ్యారంటీ పని దినాలను 100 నుంచి 125 రోజులకు పెంచారని గుర్తుచేశారు. ఇక ఢిల్లీ నుంచి పెత్తనం ఉండదని, గ్రామ సభలే ప్లానింగ్ చేస్తాయని .. 50 శాతం పనులు గ్రామ పంచాయతీల ద్వారానే జరుగుతాయని వివరించారు.
