100 రోజులు ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ ప్రణాళిక

100 రోజులు ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ ప్రణాళిక
  • ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమానికి ఏర్పాట్లు
  • 16న 119 సెగ్మెంట్లలో టిఫిన్ బైఠక్
  • ఒక్క పార్లమెంట్ సెగ్మెంట్ లో వెయ్యిమంది ప్రభావిత ఓటర్లను కలిసే ప్రోగ్రాం
  • బీజేపీయే ప్రత్యామ్నయమని చెప్పడం
  • ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యం
  • పదాధికారుల సమావేశంలో నిర్ణయం

హైదరాబాద్: రాబోయే వంద రోజులను ప్రణాళికబద్ధంగా వినియోగించుకునేందుకు బీజేపీ రెడీ అవుతోంది. ఒక్క రోజు ఒక్కో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నది. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్, సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న ప్రచారానికి చెక్ పెట్టేందుకు పకడ్బందీ కార్యాచరణను సిద్ధం చేసుకున్నది. ముఖ్యంగా బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో పెట్టి అమలు చేయని హామీలపై దృష్టి పార్టీ దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఈ నెల 16న రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో టిఫిన్ బైఠక్ పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి బీజేపీ రెడీ అవుతున్నది. ప్రతి సెగ్మెంట్లో జరిగే ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నది. విభిన్న వర్గాలతో ముచ్చటించి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో పాటు రాష్ట్రంలో బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూనే.. దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సాధించిన విజయాలను వివరించనున్నారు. ఎక్కడ కూడా కాంగ్రెస్ కు డిపాజిట్ రాలేదని నేతలు వివరించనున్నారు. మునుగోడులో కూడా కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయిందని చెప్పేందుకు కమలం నేతలు సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని, కాంగ్రెస్ కాదనే అంశాన్ని బలంగా తీసుకెళ్లేందుకు పార్టీ ఏర్పాట్లు చేసుకుంటున్నది. 

ప్రభావిత ఓటర్లను కలవడమే లక్ష్యం

ప్రతి పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో వెయ్యిమంది ప్రభావిత ఓటర్లను కలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకొన్నది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులుగా ఉంంటూ స్థానికంగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులను కలిసి మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించడం, కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనంటూ వస్తున్న రూమర్లకు సమాధానం ఇవ్వడమే లక్ష్యంగా ప్రభావిత ఓటర్ల తో కలిసే కార్యక్రమం కొనసాగనుంది. వీరి ద్వారా ఓట్లను రాబట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకొన్నది. 

మరో పోరుయాత్ర

గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేపట్టిన మరో యాత్రకు డిజైన్ చేయాలనే అభిప్రాయం పార్టీ సమావేశంలో వచ్చినట్టు తెలుస్తోంది. కిషన్ రెడ్డి నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లేందుకు ఇలాంటి యాత్ర ద్వారా అవకాశం ఏర్పడుతుందని పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. గతంలో బండి సంజయ్ ప్రజాసంగ్రామ పాదయాత్రలు చేట్టిన విషయం తెలిసిందే. ఈ సారి కూడా అలాంటి యాత్ర చేపట్టాలనే చర్చ జరిగింది. 

రేపు జిల్లాల అధ్యక్షులతో సమావేశం

రేపు ఉదయం జిల్లాల అధ్యక్షులతో మరోమారు సమావేశం నిర్వహించి వారి సందేహాలను నివృత్తి చేయాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నది. ఇవాళ జరిగిన సమావేశంలో పోలింగ్ బూత్ కమిటీల రివ్యూ, శక్తి కేంద్రాల ఏర్పాటుపై చర్చించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమస్యలను ఎంచుకొని ప్రజల్లోనే ఉండాలని, వాటిపై పోరాడాలని సమావేశంలో నిర్ణయించారు.