
- టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలి
- దేశ రక్షణ కోసం వాడాల్సిన వ్యవస్థను నాశనం చేసిండు
- కవితను లిక్కర్ స్కామ్ నుంచి తప్పించేందుకు బీజేపీ నేతలపై అక్రమ కేసులు పెట్టిండు
- ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్
- నిందితులను అరెస్ట్ చేయాలంటూ ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ధర్నా
హైదరాబాద్, వెలుగు : దేశ రక్షణ కోసం వినియోగించాల్సిన నిఘా వ్యవస్థను కేసీఆర్ దుర్వినియోగం చేశారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. అధికారం మళ్లీ దక్కించుకోవడానికి, ఉప ఎన్నికల్లో ఓటర్లను కొనుగోలు చేసేందుకు, ప్రత్యర్థులను ఆర్థికంగా దెబ్బ కొట్టేందుకు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ చేసింది ముమ్మాటికీ దేశ ద్రోహమే అని ఫైర్ అయ్యారు. ఆయనపై టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్ష నేతలు, జడ్జిల ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించారు. కేసీఆర్, హరీశ్ రావు డైరెక్షన్లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు పోలీసులు కూడా చెప్పారని తెలిపారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లక్ష్మణ్ చీఫ్ గెస్ట్‌గా హాజరై మాట్లాడారు. ‘‘ఫోన్ ట్యాపింగ్ వెనుక కేసీఆర్, హరీశ్ రావు ఉన్నట్టు పోలీసులు చెప్తున్నా ఎందుకు అరెస్ట్ చేయడం లేదు. నిందితులను శిక్షించే వరకు మా పోరాటం ఆగదు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలి. టెలికాం రెగ్యులేటరీ నిబంధనలకు విరుద్ధంగా, కేంద్రం అనుమతి లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడింది’’అని లక్ష్మణ్ అన్నారు.
బీజేపీని కట్టడి చేసేందుకు కుట్ర
అక్రమంగా దోచుకున్న సొమ్మును దాచుకునేందుకు, కవితను లిక్కర్ స్కామ్ కేసు నుంచి బయటికి తీసుకొచ్చేందుకు కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని లక్ష్మణ్ అన్నారు. ‘‘బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ మీద కేసీఆర్ ప్రభుత్వం అక్రమంగా కేసు పెట్టింది. మూడు బై ఎలక్షన్లు, జీహెచ్ఎంసీ ఎన్నికల టైమ్‌లో బీజేపీని కట్టడి చేసేందుకు, ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు పోలీస్ వ్యవస్థను కేసీఆర్ దుర్వినియోగం చేశారు”అని అన్నారు. ‘‘తాను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడినని చెప్పుకున్న రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు’’అని లక్ష్మణ్ ప్రశ్నించారు.
కేసీఆర్‌తో కాంగ్రెస్ అధిష్టానం లోపాయికారి ఒప్పందం చేసుకుందా? అని లక్ష్మణ్ నిలదీశారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్ అయ్యారని, వాళ్లు వాంగ్మూలం ఇచ్చినా మిగిలిన వారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. ‘‘ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక సూత్రధారి అయిన ప్రభాకర్ రావు అమెరికాలో దాక్కున్నడు. సీఎం రేవంత్ ఆయన్ను ఇండియాకు రప్పించి అసలు నిందితులను శిక్షించాలి’’అని అన్నారు.
కాంగ్రెస్ కంటే ఎక్కువ ఎంపీ సీట్లు గెలుస్తం
తెలంగాణ ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మరోసారి పట్టం కడ్తారని లక్ష్మణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కంటే ఎక్కువ ఎంపీ స్థానాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ‘‘కేసీఆర్ అవినీతిని అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి పదేపదే ప్రస్తావించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాళేశ్వరం, ధరణి పేరుతో దోచుకున్న డబ్బులన్నీ కక్కిస్తామని రేవంత్ అన్నరు. సీఎం అయ్యాక కేసీఆర్ అవినీతి, కుంభకోణాలపై నోరు మెదపడం లేదు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం అవుతది. ఎమ్మెల్యేల కొనుగోలు ఒక డ్రామా అని నేను ముందే చెప్పిన’’అని లక్ష్మణ్ అన్నారు.
బీఆర్ఎస్ను రద్దు చేయాలి : మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
బీఆర్ఎస్ను రద్దు చేయాలని కోరుతూ ఎన్నికల కమిషన్ కు లేఖ రాస్తానని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఒకే కుటుంబం నుంచి ఐదారుగురు పాలించిన రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని తెలిపారు. 2017 కంటే ముందు నుంచి ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, 2018లో ఎంతో మందిని హింసించారని అన్నారు. రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ బాధితుడైనప్పటికీ.. కేసీఆర్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. నిందితులపై టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో నయీం తరహా పాలన సాగిందని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా కేసీఆర్ ట్యాప్ చేయించారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఆ పార్టీ నేతలు రాంచందర్‌రావు, మర్రి శశిధర్ రెడ్డి, వినోద్, కాసం వెంకటేశ్వర్లు, ప్రేమేందర్ రెడ్డి, విజయరామారావు, వివిధ మోర్చాల నేతలు పాల్గొన్నారు.