బీజేపీపై కాంగ్రెస్, బీఆర్​ఎస్ కుట్రలు​

బీజేపీపై కాంగ్రెస్, బీఆర్​ఎస్ కుట్రలు​
  • లిక్కర్ స్కామ్, కాళేశ్వరంపై రేవంత్ ఎందుకు స్పందించట్లే : రాంచందర్ రావు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో బీజేపీ ఎదగకుండా కాంగ్రెస్, బీఆర్ ఎస్ కుట్రలు చేస్తున్నాయని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు ఆరోపించారు. పీసీసీ చీఫ్ రేవంత్ కు, సీఎం కేసీఆర్ కు ఇద్దరికీ పొరుగు రాష్ట్రం నాయకుడే గురువన్నారు. లిక్కర్ స్కామ్​, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగితే రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. మంగళవారం పార్టీ స్టేట్​ఆఫీస్​లో రాంచందర్ రావు మీడియాతో మాట్లాడారు. గత తొమ్మిదేండ్ల నుంచి తెలంగాణకు కేంద్రం ఎన్నో అభివృద్ధి పనులు శాంక్షన్ చేసిందన్నారు. ఈ నెల 8న రాష్ట్రంలో ప్రధాని మోదీ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారని ఆయన వెల్లడించారు. 

రాష్ట్రంలో 30 వేల పోలింగ్ బూత్ లలో కార్నర్ మీటింగ్ లు పెట్టి, మహా జన్ సంపర్క్ అభియాన్ పేరుతో 70 లక్షల కుటుంబాలను కలిసి మోదీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించామని చెప్పారు. బీఆర్ ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని ఆయన స్పష్టం చేశారు.  ప్రజలు, కార్యకర్తలెవరూ మీడియాలో వస్తున్న కథనాలు, రెండు పార్టీల దుష్ప్రచారాన్ని పట్టించుకోకుండా తిప్పికొట్టాలని ఆయన కోరారు. 

కాంగ్రెస్​ అభ్యర్థులను గెలిపిస్తే బీఆర్​ఎస్​లోకి వెళ్తరు 

రాష్ట్రంలో బీజేపీ బలపడుతున్నదని, అధికారంలోకి రాబోతున్న తరుణంలో పార్టీని దెబ్బతీసేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ అనుకూల శక్తులు కుట్రలకు తెరలేపాయని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ కు ఓటేస్తే గెలిచిన వాళ్లు బీఆర్ఎస్​లోకి వెళ్లటం ఖాయమన్నారు.  కోచ్ ఫ్యాక్టరీకి, టెక్స్ టైల్ పార్కు కు ఈనెల 8న ప్రధాని శంకుస్థాపన చేస్తారన్నారు. ట్రైబల్ యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం జాగా ఇవ్వటం లేదని ప్రేమేందర్ రెడ్డి గుర్తుచేశారు.