- లేదంటే ‘షార్ట్ డిస్కషన్ నోటీస్’ కింద సుదీర్ఘ చర్చ
- జనవరి 2, 3 తేదీల్లో సభ ముందుకు వాటర్ మ్యాటర్
- ఉమ్మడి ఏపీలో, ఆ తర్వాత 12 ఏండ్లలో ఎప్పుడేం జరిగిందో లెక్కలతో బయటపెట్టేందుకు సర్కారు రెడీ
- తెచ్చిన పర్మిషన్లు, వచ్చిన ప్రాజెక్టులు, చేసిన ఖర్చు, జరిగిన అక్రమాలు అన్నీ సభలోకి!
- ఏపీతో కుదిరిన అగ్రిమెంట్లు, తెలంగాణ వాడుకున్న
- నీళ్లు, ఏపీ తరలించుకుపోయిన జలాల దాకా ప్రస్తావన
- ప్రాజెక్టులవారీగా సమగ్ర రిపోర్ట్ రెడీ చేసిన ఇరిగేషన్ శాఖ
- ఈసారి సమావేశాలకు కేసీఆర్ వస్తారనే అంచనా
- వాటర్‌పై హీటెక్కనున్న అసెంబ్లీ
హైదరాబాద్, వెలుగు: కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని, రాష్ట్ర ఏర్పాటు తర్వాతపదేండ్లలో ఏపీ నీటి దోపిడీకి బీఆర్ఎస్ పెద్దలు సహకరించిన తీరును సాక్ష్యాలతో ప్రజల ముందు ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో సాగునీటిపై శ్వేతపత్రం పెట్టాలని యోచిస్తున్నది. ఒకవేళ వైట్పేపర్పెట్టడం సాధ్యంకాని పరిస్థితుల్లో ‘షార్ట్ డిస్కషన్ నోటీస్’ కింద సుదీర్ఘ చర్చ చేపట్టాలని భావిస్తున్నది. ఈ నెల 29న సభ ప్రారంభం కానుండగా.. డిప్యూటీ స్పీకర్‌గా రామ చంద్రు నాయక్బాధ్యతలు స్వీకరిస్తారు. అనంతరం సభ వాయిదా వేసి బిజినెస్ అడ్వయిజరీ కమిటీ
(బీఏసీ) మీటింగ్‌లో అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు జరపాలో నిర్ణయిస్తారు.
ఈ క్రమంలో జనవరి 2, 3 తేదీల్లో అసెంబ్లీ వేదికగా కృష్ణా, గోదావరి జలాలపై రెండు రోజుల పాటు సమగ్ర చర్చ జరపాలని, అవసరమైతే సభను పొడిగించాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు.. ఉమ్మడి ఏపీ మొదలుకొని గడిచిన 12 ఏండ్లలో కొత్త ప్రాజెక్టులకు తెచ్చిన పర్మిషన్లు, చేసిన ఖర్చు, కొత్తగా వచ్చిన ఆయకట్టు, చూపిన లెక్కలు, జరిగిన అక్రమాలు, కృష్ణా, గోదావరి జలాల పంపిణీపై కుదిరిన అగ్రిమెంట్లు, తెలంగాణ వాడుకున్న నీళ్లు, ఏపీ తరలించుకుపోయిన జలాలు.. ఇలా ఇరిగేషన్ అధికారులు అన్ని లెక్కలు బయటకు తీశారు. ప్రాజెక్టుల వారీగా ప్రత్యేక ఫైళ్లతో సమగ్ర రిపోర్ట్ రెడీ చేశారు.
ప్రధానంగా కృష్ణా నీళ్ల వాడకం, పెండింగ్ప్రాజెక్టులు, ముఖ్యంగా పాలమూరు –రంగారెడ్డి పనులు, కాళేశ్వరం రిపేర్ల విషయంలో బీఆర్ఎస్ మాటిమాటికీ కాంగ్రెస్‌ను విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చర్చను నామమాత్రంగా ముగించడం కాకుండా పూర్తిస్థాయి శ్వేతపత్రం పెట్టడం ద్వారా బీఆర్ఎస్పెద్దలను బోనులో నిలబెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. అదే సమయంలో బీఆర్ఎస్ కూడా అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నది. ప్రధానంగా ఉమ్మడి ఏపీలో తెలంగాణకు జరిగిన అన్యాయంతో పాటు గడిచిన రెండేండ్లలో ప్రాజెక్టులపై కాంగ్రెస్ సర్కారునిర్లక్ష్యం ప్రదర్శిచిందంటూ, దాన్ని ఎండగట్టాలని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఈసారి సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కూడా హాజరవుతారనే వార్తల నేపథ్యంలో సాగునీటిపై చర్చ వాడివేడిగా సాగే అవకాశం ఉంది.
కృష్ణా నీళ్లలో అన్యాయంపైనే ప్రధాన ఫోకస్
కృష్ణా జలాల పంపిణీలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాల వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, దీన్ని ప్రధానంగా ఎండగట్టాలని కాంగ్రెస్ సర్కారు భావిస్తున్నది. ఈ క్రమంలోనే ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలకు ఒప్పుకుంటూ 2015 లో బీఆర్ఎస్ పెద్దలు చేసుకున్న అగ్రిమెంట్, నాటి ఇంటర్ స్టేట్ మీటింగ్మినిట్స్ ను బయటపెట్టనున్నట్లు తెలిసింది. 2021–22లోనూ ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు పాత కోటానే కొనసాగించేలా అంగీకారం తెలపడం, బీఆర్ఎస్ అధికారంలో ఉండగానే పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతున్నా, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చేపట్టినా చూసీ చూడనట్లు ఉండటం.. నాడు అపెక్స్ కమిటీలో వ్యతిరేకించే అవకాశం ఉన్నప్పటికీ గైర్హాజరవడం లాంటి అంశాలను ప్రస్తావించడం ద్వారా బీఆర్ఎస్పెద్దలను రాష్ట్ర ప్రభుత్వం కార్నర్చేసే అవకాశం కనిపిస్తున్నది. ఈ సందర్భంగా పాలమూరు– రంగారెడ్డి నీటి కేటాయింపుల అంశమూ చర్చకు వచ్చే చాన్స్ ఉంది. ఈ ప్రాజెక్టు పర్మిషన్ల కోసం నాడు బీఆర్ఎస్ సర్కారు, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న 90 టీఎంసీల విషయంలో కొంత గందరగోళం నెలకొన్నది.
గోదావరి నుంచి కృష్ణా ఆయకట్టుకు ఏపీ మళ్లించిన 80 టీఎంసీల్లో ఎగువ రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని బచావత్ ట్రిబ్యునల్ ఆదేశాలున్నాయి. దీని ప్రకారం కర్నాటక 21 టీఎంసీలు, మహారాష్ట్ర 14 టీఎంసీలు ఇప్పటికే వాడుకుంటుండగా.. తన కోటాగా 45 టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ వాదిస్తున్నది. కానీ అప్పటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడనందున సాగర్ ఎగువన తమకూ వాటా ఉంటుందని ఏపీ తిరకాసు పెడ్తున్నది. ప్రస్తుతం ఈ అంశం ట్రిబ్యునల్ పరిధిలో ఉండడంతో మైనర్ఇరిగేషన్ కింద మిగిల్చుకున్న 45 టీఎంసీలకైనా పర్మిషన్ఇవ్వాలని కాంగ్రెస్ సర్కారు ఇటీవల సీడబ్ల్యూసీకి లెటర్రాసింది. ఈ విషయాలన్నీ తెలిసినప్పటికీ కావాలనే ఈ అంశాన్ని అటు కేసీఆర్, ఇటు హరీశ్‌రావు రాజకీయం చేసి ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపుతున్నారని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ మేరకు వాస్తవాలను సభ ద్వారా ప్రజల ముందు పెట్టాలని నిర్ణయించింది.
కేఆర్ఎంబీ పరిధి, బనకచర్ల అంశాలు
బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) పరిధిలోకి తేవడం.. ఈ క్రమంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, ప్రాజెక్టుల ఆపరేషనల్ ప్రొటోకాల్స్, నిధుల కేటాయింపు, నాగార్జునసాగర్ కుడి కాలువ వద్ద జరిగిన ఘటనలపై చర్చ చేపట్టాలని సర్కారు భావిస్తున్నది. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేది లేదని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని ప్రస్తావిస్తూనే, గతంలో జరిగిన ఒప్పందాల గురించి వివరించనున్నట్లు తెలిసింది. అలాగే బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ వద్ద ఏపీ ప్రభుత్వం చేపట్టిన పనులు, జీవో 203 జారీ, సంగమేశ్వరం పనులపై గత ప్రభుత్వ వైఖరిని కూలంకషంగా చర్చించనున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఢిల్లీ స్థాయిలో చేసిన ఫిర్యాదులు, ఎన్జీటీ ఆదేశాల అమలుకు చేస్తున్న ప్రయత్నాలనూ వివరించనున్నట్లు తెలిసింది. అటు గోదావరి జలాలపై జరగనున్న చర్చలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధానాంశంగా మారనుంది. బ్యారేజీల నిర్మాణ స్థలాలు, డిజైన్లలో మార్పు, అంచనా వ్యయాల పెంపు, కొత్తగా సాగులోకి వచ్చిన ఆయకట్టు, నాటి సర్కారు చెప్పిన లెక్కలు, వాస్తవాలు, కాగ్ నివేదికలోని అంశాలు, మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, విజిలెన్స్, ఎన్డీఎస్ఏ, జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికలను ప్రస్తావించే అవకాశం ఉంది. ప్రధానంగా కాళేశ్వరంపైనే ఫోకస్‌పెట్టి కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను పూర్తిగా పక్కన పెట్టిన తీరును రాష్ట్ర ప్రభుత్వం ఎండగట్టనుంది.
అవసరమైతే మరికొన్ని రోజులు సమావేశాలు
కృష్ణా, గోదావరి జలాలపై లోతైన చర్చ ద్వారా ప్రజలకు వాస్తవాలు చెప్పాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేసింది. వచ్చే నెల 2న పూర్తిగా కృష్ణా బేసిన్ పై , 3న గోదావరి బేసిన్ పైన చర్చకు సిద్ధమైంది. కేవలం ప్రసంగాలు కాకుండా పవర్ పాయింట్ ప్రజంటేషన్ల ద్వారా, గ్రాఫిక్స్ రూపంలో అన్ని లెక్కలూ బయటపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ప్రతిపక్షం గందరగోళం సృష్టించి సభను పక్కదారి పట్టించాలని భావిస్తే.. అసెంబ్లీని మరికొన్ని రోజులు పొడిగించి మరీ చర్చను కొనసాగించాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే ఎంత సమయమైనా కేటాయించడానికి సిద్ధమని ఇప్పటికే ఆయన సంకేతాలిచ్చారు.
పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌కు ఏర్పాట్లు
అటు ఉమ్మడి ఏపీలో, ఆ తర్వాత ఇటు తెలంగాణలో పదేండ్లపాటు కృష్ణా, గోదావరి జలాల వినియోగం, జరిగిన అన్యాయానికి సంబంధించి ప్రతి అంశాన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధ్యయనం చేసింది. మరీ ముఖ్యంగా 2014 నుంచి 2023 వరకు జరిగిన ప్రతి పరిణామాన్ని ఈఎన్సీలు, చీఫ్ ఇంజనీర్ల ద్వారా క్రోడీకరించింది. 811 టీఎంసీల కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా కింద 299 టీఎంసీలకు ఒప్పుకోవడం.. పాలమూరు– రంగారెడ్డి, ఎస్ఎల్బీసీ సహా కృష్ణా ప్రాజెక్టులపై నిర్లక్ష్యం.. పాలమూరు ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు, అనుమతులు తేలేకపోవడం.. జాతీయ హోదా సాధించలేకపోవడం.. పోతిరెడ్డిపాడు విస్తరణకు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌కు నాటి బీఆర్ఎస్ పెద్దలు అందించిన సహకారం, ఇందుకు సంబంధించిన ఒప్పందాలు, టెక్నికల్ఆధారాలతో ప్రభుత్వం చర్చకు రెడీ అయింది.
సాధారణ చర్చలా కాకుండా, ప్రజలకు పూర్తి వివరాలు తెలియజేయాలన్న ఉద్దేశంతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు (పీపీటీలు), గ్రాఫిక్స్ ద్వారా వివరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. అవసరమైతే సభను పొడిగించాలని భావిస్తున్నది. అప్పట్లో సభలో, ఏపీ పర్యటనలో సీఎం హోదాలో కేసీఆర్ మాట్లాడిన వీడియోలను కూడా ప్రదర్శించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
