జీవోలతో సుధీర్ రెడ్డి మోసగించిండు

జీవోలతో సుధీర్ రెడ్డి మోసగించిండు
  • బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి

ఎల్ బీనగర్, వెలుగు: పేదలను మోసగించడం, ప్రజాధనం దుర్వినియోగం చేయడమే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పని అని రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆరోపించారు. జీవో నం.118తో ప్రజలను మభ్యపెట్టి మోసగించారని విమర్శించారు. రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ ఆఫీసులో శుక్రవారం కార్పొరేటర్లతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. జీవోల పేరుతో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మోసగించారని దాదాపు 17,000 మంది లబ్ధిదారులకు నిరాశే ఎదురైందని తెలిపారు. 

జీఓలో ఎలాంటి స్పష్టమైన గైడ్ లైన్స్ లేకుండా నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ లో చాలామంది అన్యాయానికి గురవుతున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఒకలా.. తహసీల్దార్ మరోలా.. రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఇంకోలా..పొంతన లేకుండా చెబుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. 

జీవోలను సరిచేసి ఎన్ఓసీ సర్టిఫికెట్ల ద్వారా ప్రజలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్పొరేటర్లు కళ్లెం నవనజీవన్ రెడ్డి, వంగా మధుసూదన్ రెడ్డి, కొప్పుల నర్సింహ్మారెడ్డి, బద్దం ప్రేమ్,లచ్చిరెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి,బీజేపీ రాష్ట్ర నేతలు చింతల సురేందర్ యాదవ్,కొత్త రవీందర్ గౌడ్ తదితరులు పాల్గన్నారు.