హైదరాబాద్, వెలుగు: త్వరలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తును మరింత ముమ్మరం చేసింది. పార్టీ నియమించిన స్క్రీనింగ్ కమిటీ తన నివేదికను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావుకు సమర్పించింది. ఎమ్మెల్సీ స్థానాలకు ఆశావాహుల సంఖ్య భారీగా ఉండటంతో.. పార్టీ హైకమాండ్ రెండు స్థానాలకు వేర్వేరుగా త్రీమెన్ కమిటీలను రంగంలోకి దించింది. ఈ కమిటీలు మంగళవారం క్షేత్రస్థాయిలో పార్టీ ముఖ్య నేతలు, స్థానిక నాయకుల నుంచి అభిప్రాయాలను సేకరించాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ స్థానానికి హైదరాబాద్ సిటీ పార్టీ ఆఫీసులో ఈ నియోజకవర్గానికి సంబంధించిన నేతలతో కమిటీ సమావేశమైంది. స్థానిక నేతలు, ప్రజాప్రతినిధుల నుంచి ఒక్కొక్కరిగా వివరాలు తెలుసుకుని, అభ్యర్థిత్వంపై ఎవరికి మొగ్గు ఉందో రికార్డు చేసింది.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పేరుతో సహా మొత్తం 15 మంది వరకూ పేర్లు ప్రతిపాదనలు వచ్చినట్టు సమాచారం. వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానం నుంచి వరంగల్ కేంద్రంగా ఈ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో స్క్రీనింగ్ కమిటీ సమాలోచనలు జరిపింది. టికెట్ ఆశిస్తున్న స్థానిక నేతలతో పాటు బయటి వ్యక్తుల నుంచి వస్తున్న ప్రతిపాదనలపై నాయకుల నుంచి కీలక అభిప్రాయాలు తీసుకుంది. ఇక్కడ చాలా తక్కువ మంది పేర్లు వచ్చినట్టు తెలిసింది. ఈ లిస్టులను ఇవ్వాలో, రేపో రాష్ట్ర కోర్ కమిటీ సమావేశమై..మూడు పేర్లను జాతీయ అధిష్టానానికి పంపించనున్నారు. హైకమాండ్ ఆమోదముద్ర పడగానే వీలైనంత త్వరగా అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
