
టీఆర్ఎస్ కు చెక్ పెట్టడమే లక్ష్యంగా క్యాండేట్లపై కసరత్తు
సీనియర్లు, బలమైన అభ్యర్థులను బరిలోకి దించే యోచన
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన వారు కూడా..
రిజర్వేషన్ల ఖరారే ఆలస్యం.. ఆ వెంటనే అభ్యర్థుల ఎంపికకు రెడీ
మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో చూపాలని కమలం పార్టీ భావిస్తోంది. బలమైన అభ్యర్థులను బరిలో దింపి అధికార టీఆర్ఎస్కు గట్టి సవాల్ విసిరేందుకు సిద్ధమవుతోంది. మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి నాయకులు, గత అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను.. స్థానిక పరిస్థితులు, అవసరాలను బట్టి కార్పొరేటర్లు, కౌన్సిలర్లుగా పోటీలో నిలిపేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. మున్సిపాల్టీ లేదా కార్పొరేషన్పరిధిలోని ఏ స్థాయి నాయకుడైనా రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకుని తనకు అనుకూలమైన వార్డు లేదా డివిజన్ ను సెలెక్ట్ చేసుకుని పోటీకి మానసికంగా సిద్ధం కావాలనే సంకేతాలను పంపేందుకు సన్నాహాలు చేస్తోంది. వార్డు, డివిజన్ రిజర్వేషన్లు ఖరారైన మరుక్షణమే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కమలదళం రెడీ అవుతోంది. రాష్ట్రంలో తమ పార్టీని టీఆర్ఎస్ టార్గెట్ చేయడాన్ని సీరియస్ గా తీసుకుంటున్నట్లు బీజేపీ నేతలు గులాబీ పార్టీకి తగిన రీతిలో జవాబిచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
‘గులాబీ’దారిలోనే..
బలమైన నాయకులు, అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన నేతలను ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బరిలోకి దించి మంచి ఫలితాలను సాధించింది. తాము కూడా ఇదే వ్యూహాన్ని మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించి మంచి ఫలితాలు సాధించేందుకు కమలం పార్టీ సమాయత్తమవుతోంది. లోక్సభ ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లు గెలవడం, ఇతర పార్టీలకు చెందిన సీనియర్ నేతలు కాషాయ కండువా కప్పుకోవడంతో ఊపు మీదున్న కమలనాథులు, మున్సిపల్ ఎన్నికలను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. కీలక మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని నిరూపించుకునేందుకు.. మెజార్టీ డివిజన్లు, వార్డులను గెలుచుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. పార్టీ సభ్యత్వ నమోదు కూడా జోరుగా సాగుతుండడంతో క్యాడర్ కూడా మంచి జోష్ లో ఉంది. చాలా చోట్ల సభ్యత్వ నమోదుతోపాటే మున్సిపల్ ఎన్నికల ప్రచారం కూడా సాగిస్తున్నారు.
4 ఎంపీ సీట్ల పరిధిపై ఫోకస్
బీజేపీ గెలిచిన సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లోక్సభ సెగ్మెంట్ల పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో టీఆర్ఎస్ తో నువ్వా.. నేనా అనే రీతిలో తలపడేలా అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక కార్యచరణ చేపట్టాలని ఎంపీలకు పార్టీ నాయకత్వం సూచించినట్లు తెలిసింది. తమ సెగ్మెంట్లలో మెజార్టీ సీట్లను గెలిపించుకుని మరోసారి గులాబీ పార్టీకి షాక్ ఇచ్చేందుకు బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, అర్వింద్, బాపూరావు వ్యూహాలకు పదును పెడుతున్నారు. పట్టణ ఓటర్లు, యువత తమ పట్ల సానుకూలంగా ఉంటారని, అర్బన్ ఏరియాలో తమకు మంచి ఓటు బ్యాంకు ఉందని బీజేపీ నేతలు విశ్వసిస్తున్నారు. కాగా, ఇప్పటి వరకూ తాము జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులుగా గుర్తింపు పొందామని, మున్సిపల్ ఎన్నికల్లో బరిలోకి దిగితే పట్టణ ప్రాంతాలకే పరిమితమయ్యే అవకాశం ఉందని పలువురు నేతలు సంశయంలో ఉన్నట్లు సమాచారం.