బీజేపీని 400 కన్నా ఎక్కువ చోట్ల గెలిపించాలి : ఎన్నారై

బీజేపీని 400 కన్నా ఎక్కువ చోట్ల గెలిపించాలి : ఎన్నారై
  • భారత్​లో ఓటర్లకు తెలుగు ఎన్నారైల పిలుపు
  • అమెరికాలోని న్యూజెర్సీలో చాయ్ పే చర్చ కార్యక్రమం

న్యూజెర్సీ : భారత్​లో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 400 కన్నా ఎక్కువ సీట్లు వచ్చేలా చూడాలని ఓటర్లకు అమెరికా నుంచి తెలుగు ఎన్నారైలు పిలుపునిచ్చారు. న్యూజెర్సీలో ఈ నెల 9న ‘ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ’ ఆధ్వర్యంలో నిర్వహించిన చాయ్ పే చర్చ కార్యక్రమంలో పలువురు తెలుగు ఎన్నారైలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలాస్  జంబుల మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికల్లో ప్రతిఒక్కరూ బీజేపీకే ఓటు వేయాలన్నారు. బీజేపీ 400 సీట్లలో గెలిస్తేనే మోదీ విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు.

ఇప్పటికే ఆర్టికల్  370 రద్దు, ట్రిపుల్  తలాక్  రద్దు, అయోధ్యలో రామ మందిర నిర్మాణం వంటి విషయాల్లో మోదీ సర్కారు విజయవంతం అయిందన్నారు. నాగ మహేందర్  మాట్లాడుతూ నరేంద్ర మోదీ మూడోసారి కూడా ప్రధాని కావాల్సిన అవసరం ఉందన్నారు. 400 కన్నా ఎక్కువ సీట్లలో బీజేపీని గెలిపిస్తేనే ఇండియాలో పెను మార్పులు వస్తాయన్నారు. కృష్ణా రెడ్డి మాట్లాడుతూ వచ్చే 25 ఏండ్లలో ఇండియాను ఎలా అభివృద్ధి చేయాలో ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచిస్తున్నారని అన్నారు. 2047 లోపు భారత్  అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే మోదీని మళ్లీ గెలిపించాలని ఆయన కోరారు.

శ్రీకాంత్  మాట్లాడుతూ భారత్ ను విశ్వగురువుగా నిలిపేందుకు గత పదేండ్లుగా మోదీ కృషి చేస్తున్నారన్నారు. విదేశాల్లో భారత్ కు గౌరవం దక్కుతున్నదంటే అందుకు మోదీయే కారణమని ఆయన పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతిఒక్కరూ బీజేపీకి ఓటువేసి గెలిపించాలని కోరారు. 2047 లోపు వికసిత్  భారత్  కల నెరవేరాలంటే బీజేపీ 400 కన్నా ఎక్కువ సీట్లలో గెలిపించాలని ధీరేన్  మెహతా పిలుపునిచ్చారు.