టీఆర్ఎస్ నామినేషన్ ప్రక్రియ జబర్దస్త్ ను తలపించింది: బీజేపీ నేత రాకేశ్ రెడ్డి

టీఆర్ఎస్ నామినేషన్ ప్రక్రియ జబర్దస్త్ ను తలపించింది: బీజేపీ నేత రాకేశ్ రెడ్డి

నల్గొండ: టీఆర్ఎస్ నామినేషన్ ప్రక్రియ జబర్దస్త్ షోను తలపించిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. మునుగోడు ప్రచారంలో ఉన్న ఆయన అక్కడి బీజేపీ క్యాంప్ ఆఫీసులో మాట్లాడారు. నామినేషన్ అనంతరం తన ప్రసంగంతో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి జబర్దస్త్ కమెడియన్లను మించిపోయారన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. కల్వకుంట్ల కుటుంబానికి పాలేరులా మారాడని విమర్శించారు. ఇప్పటికే టీఆర్ఎస్ నుంచి అసెంబ్లీలో చాలా మంది ఎంటర్టైనర్లు ఉన్నారని, మనుగోడు నుంచి ఇంకొకరిని పంపడానికి టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఎద్దేవా చేశారు. ప్రజల బాగు కోసం ఏమైనా చేయగలిగే రాజగోపాల్ రెడ్డి కావాలా? లేక కేసీఆర్ కుటుంబానికి డూడూ బసవన్నలా వ్యవహరిస్తోన్న ప్రభాకర్ రెడ్డి కావాలా నిర్ణయించుకోవాలని ప్రజల్ని కోరారు. రాజగోపాల్ రెడ్డి  కాంట్రాక్ట్ కోసం పార్టీ మారాడని అనడంలో ఎలాంటి అర్థంలేదని, మునుగోడు ప్రజల కోసమే ఆయన రాజీనామా చేశారని స్పష్టం చేశారు.  

మోడీ, అమిత్ షా ముందు కేటీఆర్ ఓ బచ్చా

ప్రధాని మోడీ, కేంద్ర హోం మత్రి అమిత్ షా ముందు కేటీఆర్ ఓ బచ్చా అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి  రాకేశ్ రెడ్డి విమర్శించారు. వాళ్లను విమర్శించే స్థాయి కేటీఆర్ కు లేదని తేల్చి చెప్పారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడిందని, లేకుంటే వంద కోట్లతో విమానం కొనేంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. దుబ్బాక, హుజురాబాద్, హైదరాబాద్ లో వచ్చిన ఫలితమే మునుగోడులో కూడా  వస్తుందని రాకేశ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.