మాదిగలకు అన్ని పార్టీలు ద్రోహం చేసినయ్​: కృష్ణప్రసాద్

 మాదిగలకు అన్ని పార్టీలు ద్రోహం చేసినయ్​: కృష్ణప్రసాద్
  • నేను మాదిగ కాబట్టే..  కేసీఆర్ డీజీపీ పోస్ట్ ఇయ్యలే


హైదరాబాద్, వెలుగు : ప్రతి రాజకీయ పార్టీ మాదిగల ఓట్లను వాడుకొని ద్రోహం చేశాయని బీజేపీ అధికార ప్రతినిధి, రిటైర్డ్‌ ఐపీఎస్ కృష్ణప్రసాద్ ఆరోపించారు. తాను మాదిగ కాబట్టే.. అన్ని అర్హతలు ఉన్నా తనకు డీజీపీ పోస్ట్ ఇవ్వకుండా సీఎం కేసీఆర్ అడ్డుకున్నారని అన్నారు. మూడేండ్లు అప్రధాన్య పోస్ట్ లో కొనసాగించారని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణకు కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ ఇచ్చిన హామీతో మాదిగల కల నెరవేరబోతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 

30 ఏండ్లుగా చేస్తున్న పోరాటానికి న్యాయం జరుగుతుందని మాదిగలు ఎదురుచూస్తున్నారని అన్నారు. మంగళవారం సోమాజిగూడలోని బీజేపీ మీడియా సెంటర్ లో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో బలైన వాళ్లలో సగం మందికి పైగా దళితులే ఉన్నారన్నారు. దళితబంధు ఎంత మందికి ఇచ్చారో సీఎం కేసీఆర్​ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.  దళిత సీఎం, మూడెకరాల భూమి ఇస్తామని మోసం చేశారన్నారు. 

మాదిగలతో  దేశ ప్రధాని వేదిక పంచుకోవటం గొప్ప విషయమని, ఏ ప్రధాని కూడా మాదిగల మీటింగ్ కు రాలేదన్నారు.  గత తొమ్మిదేండ్లలో అంబేద్కర్ జయంతి, వర్ధంతికి అటెండ్ అయి నివాళులు అర్పించే తీరిక కేసీఆర్ కు దొరకలేదని ఆయన విమర్శంచారు. అంబేద్కర్ ను కేసీఆర్ చాలా అవమానించారని కృష్ణప్రసాద్ ఫైర్​ అయ్యారు.