పంచాయతీ లకు మరో రూ.387 కోట్లు : మంత్రి సీతక్క

పంచాయతీ లకు మరో రూ.387 కోట్లు : మంత్రి సీతక్క
  •     15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసిన కేంద్రం
  •     పెండింగ్ లో ఉన్న రూ.2,400 కోట్లు రిలీజ్ చేయాలి: మంత్రి సీతక్క

హైద‌‌రాబాద్‌‌, వెలుగు: గ్రామ పంచాయతీలకు15వ ఆర్థిక సంఘం నిధులు  రూ.387 కోట్లను కేంద్రం గురువారం రిలీజ్​చేసింది. మొదటి విడతలో రూ.259.36 కోట్లు విడుదల చేసిన కేంద్రం.. తాజాగా రిలీజ్​ చేసిన నిధులతో కలిపి ఇప్పటివరకు రూ.646.36 కోట్లు ఇచ్చినట్లయింది. రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికలను పూర్తిచేసి, కేంద్ర ప్రభుత్వం కోరిన సమాచారం, నిధుల వినియోగ వివరాలను సమర్పించడంతో ఈ నిధులు విడుదలైనట్టు అధికారులు పేర్కొన్నారు. గ్రామాల్లో మౌలిక వసతులు, పారిశుధ్యం, తాగునీరు, గ్రామీణ రహదారుల మెరుగుదల వంటి పనులకు ఈ నిధులను ఉపయోగించనున్నారు. 

అయితే 15వ ఆర్థిక సంఘం కింద తెలంగాణకు మొత్తం రూ.3,000 కోట్ల వరకు రావాల్సి ఉండగా, ఇప్పటికీ సుమారు రూ.2,400 కోట్లు పెండింగ్‌‌లో ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. గ్రామాల అభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతం కోసం పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని మంత్రి సీతక్క కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి వేగవంతం కావాలంటే కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరమని ఆమె పేర్కొన్నారు.