తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు షురూ అయింది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తున్నారు. సాయంత్రానికి ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. మొత్తం 136 కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, మైక్రో అబ్జర్వర్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు కట్టుదిట్టంగా జరుగుతోంది.
ఫలితాలపై రాజకీయ పార్టీలతో పాటు అభ్యర్థులు, ఓటర్లలో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. డివిజన్ల సంఖ్య ఎక్కువగా ఉండే కార్పొరేషన్లలో అన్ని డివిజన్ల కౌంటింగ్ ఏకకాలంలో ప్రారంభమయింది. మున్సిపాలిటీల్లో మాత్రం రిటర్నింగ్ ఆఫీసర్ల సంఖ్య ప్రకారం టేబుళ్లు వేశారు. ఒక వార్డు తర్వాత, మరొకటి చొప్పున ఒక్కో ఆర్వోకు కేటాయించిన వార్డులన్నీ లెక్కిస్తారు. ఒక్కో డివిజన్/వార్డు లెక్కింపు గరిష్టంగా ఐదు రౌండ్లలో పూర్తవుతుంది.
కౌంటింగ్ సెంటర్ల లోపల, బయట సీసీ కెమెరాల ద్వారా వెబ్ కాస్టింగ్ ఏర్పాటుచేశారు. సెంటర్ల దగ్గర ఎలాంటి గొడవలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ నేపథ్యంలో ఏయే డివిజన్లో ఎవరు గెలుస్తారు? ఆయా బల్దియాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? మేయర్, చైర్ పర్సన్ సీటు ఎవరికి దక్కుతుంది? లాంటి అంశాలపై పలుచోట్ల జోరుగా బెట్టింగ్లు జరుగుతున్నాయి.
