టీడీపీ లీడర్లపై బీజేపీ నజర్

టీడీపీ లీడర్లపై బీజేపీ నజర్

తెలుగు రాష్ట్రాల్లో బలమైన పార్టీగా నిలబడేందుకు బీజేపీ అడుగులు వేస్తోంది. సొంత బలంతోపాటు ఇతర పార్టీల నుంచి వచ్చే లీడర్లను చేర్చుకొని పెద్ద పార్టీగా తయారయ్యేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే ఏపీలో పలువురు టీడీపీ లీడర్లతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. లైన్​లో తెలంగాణ టీడీపీ నేతలూ ఉన్నట్టు సమాచారం.

ఏపీ తెలంగాణలో బీజేపీ ఆపరేషన్​ ఆకర్ష్​కు తెరతీస్తోంది. ఆ పార్టీ అగ్ర నేతల సూచనలతో రాష్ట్ర లీడర్లు రంగంలోకి దిగారు. రెండు రాష్ట్రాల్లో ఇతర పార్టీల్లోని అసమ్మతి నాయకులను సంప్రదిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీపై దృష్టి పెట్టారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిన టీడీపీ పూర్తిగా డీలా పడిపోవడంతో ఆ పార్టీ లీడర్లు చాలామందితో బీజేపీ టచ్‌‌లో ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో కూడా టీడీపీ లీడర్లు బీజేపీ వైపే చూస్తున్నట్టు సమాచారం.

ఏపీలో పాగా వేయాలె

ఏపీలో బీజేపీకి బలమైన లీడర్లు పెద్దగా లేరు. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ నుంచి కొందరు గట్టి నేతల్ని చేర్చుకుంటే బలపడొచ్చన్న యోచనలో బీజేపీ ఉంది. అనంతపురానికి చెందిన పరిటాల సునీత, ఆమె కుమారుడు శ్రీరామ్‌‌ను బీజేపీలోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి మధ్యవర్తిత్వం చేస్తున్నట్టు సమాచారం. అదే ప్రాంతానికి చెందిన జేసీ బ్రదర్స్‌‌ను కూడా బీజేపీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్నారు. అద్దంకికి చెందిన గొట్టిపాటి రవికుమార్‌‌తోనూ బీజేపీ లీడర్లు టచ్‌‌లో ఉన్నారు. ఏపీ బీజేపీ చీఫ్‌‌ కన్నా ఆయనతో (మొదటి పేజీ తరువాయి)

మాట్లాడుతున్నట్టు చెబుతున్నారు. ఈ మధ్యే టీడీపీ ఎంపీగా ఎన్నికైన కేశినేని నాని అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు రావడంతో ఆయన్ను కూడా బీజేపీలో చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో రాజకీయంగా పట్టున్న ఓ కుటుంబంపై కూడా బీజేపీ దృష్టి సారించింది.

తెలంగాణలో వికసించే యత్నాలు

తెలంగాణలో నామమాత్రంగా మిగిలిన టీడీపీ నుంచి బలమైన లీడర్లపైనా కన్నేసింది. టీడీపీపై బీజేపీ దృష్టి పెట్టడానికి కారణం ఆ పార్టీకి కిందిస్థాయిలో మంచి కేడర్‌ ఉండడం. ఇటీవలే టీడీపీ నేత పెద్దిరెడ్డి, చాడ సురేశ్‌రెడ్డి బీజేపీ అగ్రనేతలతో భేటీ అయ్యారు. టీడీపీలో ఒకప్పుడు నంబర్‌ టూగా ఉన్న దేవేందర్‌గౌడ్‌ను ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయనతోపాటు ముగ్గురు నలుగురు మాజీ ఎమ్మెల్యేలు సైతం బీజేపీతో టచ్‌లో ఉన్నట్టు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్‌ బలహీనంగా ఉండడంతో ప్రతిపక్ష స్థానాన్ని ఆక్రమించేందుకు బీజేపీ ప్రయత్నాలు వేగవంతం చేస్తోంది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో 4 సీట్లు గెల్చుకున్న ఊపులో ఉన్న ఆ పార్టీ.. ఇతర పార్టీల్లోని ప్రముఖ లీడర్లను ఆకర్షించే ప్రయత్నంలో ఉంది. లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ నుంచి డీకే అరుణ, టీఆర్‌ఎస్‌ నుంచి జితేందర్‌ రెడ్డిలాంటి నేతల్ని చేర్చుకున్నట్టే.. మరికొందరిని తిప్పుకునే ప్రయత్నంలో ఉంది. తెలుగువాడైన బీజేపీ ముఖ్య నేత ఒకరు జాతీయ అధ్యక్షుడు అయితే అన్ని పార్టీల నుంచి చేరికలు భారీగా ఉంటాయని విశ్లేషకుల అంచనా.