విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ భవనాన్ని నిర్మించాలె

విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ భవనాన్ని నిర్మించాలె

హైదరాబాద్, వెలుగు: విశ్వకర్మలకు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ వెంటనే నెరవేర్చాలని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ డిమాండ్ చేశారు. విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ భవనాన్ని నిర్మించాలని, ఆ సామాజిక వర్గం అభివృద్ధికి తగిన నిధులు కేటాయించాలని కోరారు. తమకు ఇచ్చిన హామీలను కేసీఆర్ పట్టించుకోవడం లేదంటూ మంగళవారం కరీంనగర్ లో విశ్వకర్మలు సంజయ్ ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. తమ పోరాటానికి మద్దతివ్వాలని కోరారు. నాలుగేండ్ల క్రితం వరంగల్ సభలో విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి రూ.250 కోట్లు విడుదల చేస్తామని సీఎం కేసీఆర్​ హామీ ఇచ్చారని, హైదరాబాద్ ఉప్పల్ భగాయత్ లో 5 ఎకరాల స్థలంలో ఆత్మ గౌరవ భవనాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారని వారు గుర్తు చేశారు.

ఇంతవరకు ఒక్క హామీ నెరవేర్చలేదని, పైగా సంఘాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. స్పందించిన సంజయ్.. విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఐక్య సంఘం నేతల పోరాటానికి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. హామీలను అమలు చేయకుంటే విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సంఘంతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సంజయ్ ని కలిసిన వారిలో విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎర్రోజు భిక్షపతి, నందిపేట రవీందర్, పలువురు సంఘ ప్రతినిధులు ఉన్నారు.