వలసలు నిరూపిస్తే రాష్ట్రం వదిలిపోతవా?

వలసలు నిరూపిస్తే రాష్ట్రం వదిలిపోతవా?

వలసలు నిరూపిస్తే రాష్ట్రం వదిలిపోతవా?
కేసీఆర్​కు సంజయ్​ సవాల్​

మహబూబ్​నగర్, వెలుగు : పాలమూరు ప్రజలపై కేసీఆర్ పగబట్టారని, కక్ష సాధిస్తున్నారని బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్ అన్నారు. పాలమూరులో వలసలు ఉన్నాయని, దాన్ని నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ‘‘ఒక వేళ నేను నిరూపించలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా. నిరూపిస్తే కేసీఆర్​, ఆయన కుటుంబం తెలంగాణ వదిలిపోతుందా? నా సవాల్​కు కేసీఆర్​ సిద్ధమా?’’ అని ఆయన ప్రశ్నించారు. గురువారం మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సంజయ్​ మాట్లాడారు. ‘‘2009 ఎన్నికల్లో పాలమూరు ఎంపీగా గెలిచి, 2014 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయ్యి పాలమూరుకు కేసీఆర్​ ఏం చేసిండు. సీఎంగా ప్రమాణం చేసి, పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పి, వేల కోట్లను నాశనం చేసిండు. భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు స్కీంలను గాలికి వదిలేసిండు. అలంపూర్​ నుంచి పాలమూరు దాకా పాదయాత్ర చేస్తుంటే మొత్తం రాళ్లు తప్ప, ఎక్కడా చెట్టు కూడా కనిపించలె. ఉమ్మడి పాలమూరును మొత్తం ఎడారిని చేసిండు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీఎస్​ విషయంలో కేసీఆర్​ వైఖరిపై ఏపీ, కర్నాటక ప్రభుత్వాలు నవ్వుకుంటున్నాయన్నారు. కేసీఆర్​ సహకరిస్తే ఆరు నెలల్లో ఆర్డీఎస్​ను ఆధునీకరించి చూపిస్తామని చెప్పారు. ‘‘కృష్ణా జలాల్లో తెలంగాణకు 575 టీఎంసీల నీటి వాటా ఉంది. కానీ 2014 ఎన్నికల తర్వాత అప్పటి ఏపీ సీఎం చంద్రబాబుకు కేసీఆర్​ అమ్ముడుపోయాడు. తెలంగాణకు 299 టీఎంసీలే సరిపోతాయని ఒప్పుకొని ఫైల్​పై సంతకం చేసిండు. రూ.1,400 కోట్లు ఖర్చు చేస్తే జీవో 69 ద్వారా కొడంగల్​, నారాయణపేట, మక్తల్​ నియోజకవర్గాలకు నీళ్లు వస్తాయి. కానీ  ఇందుకు కేసీఆర్​ మనసు ఒప్పడం లేదు” అని అన్నారు.  అమరవీరులకు క్షమాపణలు చెప్పాకే రాహుల్ ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టాలన్నారు. బహిరంగ సభలో  బీజేపీ రాష్ట్ర ఇన్​చార్జ్​ తరుణ్​చుగ్​, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీ సోయం బాపురావు, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, మాజీ ఎంపీ జితేందర్​రెడ్డి, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, పార్టీ మధ్యప్రదేశ్ ఇన్​చార్జ్​ మురళీధర్​రావు, నాయకులు కె.లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర కేబినెట్​లో ఉద్యమకారులేరి? : కిషన్​రెడ్డి
‘‘ఎన్నికలు అంటే ఫామ్​హౌస్​ సీఎం కేసీఆర్​ భయపడుతున్నడు. ఆయన కొడుకును సీఎంగా చూడలేకపోతానేమోనని నిద్ర కూడా పోతలేడు. దుబ్బాక, హుజూరాబాద్​లో మాదిరిగానే, వచ్చే ఎన్నికల్లో ప్రజలు టీఆర్​ఎస్​ పార్టీకి తగిన బుద్ధి చెబుతారు’’ అని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి అన్నారు. కేసీఆర్, ఒవైసీ కుటుంబాల చేతిలో తెలంగాణ తల్లి బంధీ అయిందన్నారు. రాష్ట్ర కేబినెట్​లో ఉద్యమకారులు లేరని, తెలంగాణ ద్రోహులు మాత్రమే ఉన్నారని దుయ్యబట్టారు. ప్రగతి భవన్​కు వెళ్లడానికి ప్రజలకు పర్మిషన్ ఉండదని, అదే ఎంఐఎం లీడర్లకు మాత్రం బైక్​లపై కూడా ప్రగతి భవన్, కేసీఆర్​ ఫామ్​హౌస్​కు  వెళ్లేందుకు అనుమతి ఉంటుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే, ప్రగతిభవన్​ను తెలంగాణ ప్రజా భవన్ గా మారుస్తామని చెప్పారు. 

కేటీఆర్​ మత్తులో మాట్లాడుతుండు : అర్వింద్​
కేటీఆర్​కు దమ్ముంటే కేంద్రం ఇచ్చే నిధులపై చర్చకు సిద్ధమా? అని ఎంపీ అర్వింద్​ సవాల్​ విసిరారు. ‘‘కేటీఆర్​ రెచ్చిపోయి మాట్లాడుతున్నడు. ఆయన మాటలు చూస్తే మత్తు ఎక్కువై మాట్లాడుతున్నట్లు అర్థమవుతున్నది.  తెలంగాణ నుంచి కేంద్రానికి రూ.3,65,797 కోట్లు పన్నుల రూపంలో  వెళ్లిందని, అందులో రాష్ట్రానికి తిరిగి వచ్చింది రూ.1,68,648 కోట్లేనని కేటీఆర్​ చెప్తున్నడు. అయితే కేంద్రం పథకాల కోసం రాష్ట్రానికి రూ.1,14,585 కోట్లు ఇచ్చింది. ఇవి కాకుండా వివిధ అభివృద్ధి పనులకు కలిపి మొత్తం రూ.3,94,000  కోట్లను తిరిగి కేంద్రం ఇచ్చింది.  పేదల ఫ్రీ బియ్యాన్ని కూడా బ్లాక్​ మార్కెట్లో అమ్ముకుంటున్న దొంగ కేటీఆర్” అని ఆయన దుయ్యబట్టారు. 

పాలమూరు ఎంపీ ఎన్నడైన కనిపించిండా?: రఘునందన్​
పాలమూరు ఎంపీ మన్నె శ్రీనివాస్​రెడ్డి ఎన్నడైన పాలమూరుకు వచ్చారా? అని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు ప్రశ్నించారు. ఆయన పాలమూరులో ఇప్పటి దాకా మూడు సార్లే తిరిగిండని ఆరోపించారు. కర్నాటక ఎమ్మెల్యేలు తెలంగాణ అభివృద్ధి కావాలని  ఫోన్​ చేస్తున్నట్లు కేటీఆర్​ చెబుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. బీదర్​, రాయచూర్​కు టీఎస్ ​ఆర్టీసీ వాళ్లు వెళ్లి ఎందుకు అక్కడి బంకుల్లో డీజిల్ పోయించుకుంటున్నారో కేటీఆర్​ సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు. బీజేపీ బలం లేని పార్టీ అని చెబుతున్న రేవంత్​రెడ్డి.. కొడంగల్​లో ఎందుకు ఓడిపోయారో తెలుసుకోవాలన్నారు.