
బీఎల్ సంతోష్ కు సిట్ నోటిసులివ్వడంపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఎల్ సంతోష్ జోలికి వస్తే సహించేదే లేదన్నారు. బీఎల్ సంతోష్ కి ఫామ్ హౌజ్ లు, బ్యాంక్ అకౌంట్లు లేవన్నారు. ఎవరో ఏదో మాట్లాడితే బీఎల్ సంతోష్ కు ఏం సంబంధం అని ప్రశ్నించారు. బీఎల్ సంతోష్ దేశం కోసం పనిచేసే వ్యక్తంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఎంపీ, ఎమ్మెల్యే కావాలని ఆయన కోరుకోలేదన్నారు. ప్రచారకుల జోలికి వస్తే బీజేపీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని అన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులపై కేసులను డైవర్ట్ చేయడానికే ఈ డ్రామాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ కుట్రలను ఎక్కడిక్కడ తిప్పి కొడతామన్నారు. గడీల పాలనను త్వరలోనే బద్దలు కొడతామని సంజయ్ అన్నారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోష్ కు సిట్ నోలీసులు జారీ చేసింది. అయితే ఆయన విచారణకు రాకపోవడంతో సిట్ హైకోర్టుకెళ్లింది. ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు హాజరుకావడం లేదని నిందితుల తరఫు లాయర్ ను కోర్టు ప్రశ్నించింది. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఉన్నందున విచారణకు హాజరుకాలేకపోతున్నారని బీఎల్ సంతోష్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు, సిట్ విచారణ తదితర అంశాలను బుధవారం ఉదయం 10 :30 గంటలకు పరిశీలిస్తామని ..తదుపరి విచారణను వాయిదా వేసింది.