
2030 కామన్ వెల్త్ గేమ్స్ కి వేదికగా ఇండియా ఎంపికయ్యింది. అహ్మదాబాద్ వేదికగా ఈసారి కామన్ వెల్త్ గేమ్స్ జరగనున్నాయి. ఇండియాలో కామన్ వెల్త్ గేమ్స్ జరగడం ఇది రెండోసారి. గతంలో 2010లో కామన్ వెల్త్ గేమ్స్ కి దేశ రాజధాని ఢిల్లీ వేదికయ్యింది. కామన్ వెల్త్ గేమ్స్ నిర్వహణకు అహ్మదాబాద్, నైజీరియా రాజధాని అబూజా ప్రతిపాదనలు సమర్పించగా.. కామన్ వెల్త్ స్పోర్ట్స్ ఎవాల్యూయేషన్ కమిటీ అహ్మదాబాద్ ను ఎంపిక చేసింది.
ప్రతిపాదనలు పంపిన అహ్మదాబాద్, అబూజా నగరాల ప్రమాణాలకు అనుగుణంగా అంచనా వేసిన EB అహ్మదాబాద్ ను ఎంపిక చేసింది.నవంబర్ 26న గ్లాస్గోలో జరిగే కామన్వెల్త్ స్పోర్ట్ జనరల్ అసెంబ్లీలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారని ఒక ప్రకటనలో తెలిపింది కమిటీ.
2030లో అహ్మదాబాద్ లో జరగనున్న శతాబ్డి వేడుకలు కామన్ వెల్త్ గేమ్స్ చరిత్రలో ఒక మైలురాయి అని పేర్కొన్నారు కామన్ వెల్త్ స్పోర్ట్స్ తాత్కాలిక అధ్యక్షుడు డాక్టర్ డోనాల్డ్ రుకరే.
కామన్ వెల్త్ గేమ్స్ నిర్వహణ ఇండియా యొక్క ప్రపంచస్థాయి క్రీడా, ఈవెంట్ సామర్థ్యాన్ని ప్రదర్శించడమే కాకుండా.. 2047 వికసిత్ భారత్ వైపు ఇండియా ప్రయాణంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.