చార్జీలు  ఎందుకు పెంచుతున్నవ్‌?

చార్జీలు  ఎందుకు పెంచుతున్నవ్‌?
  • జీడీపీలో టాప్‌ అన్నవ్‌.. చార్జీలు ఎందుకు పెంచుతున్నవ్‌?
  • కేసీఆర్‌ను ప్రశ్నించిన బండి సంజయ్
  • లీటర్ పెట్రోల్‌‌, డీజిల్ పై రాష్ట్ర సర్కార్ పన్నే రూ.40
  • అది తగ్గించుకుంటే ఆర్టీసీ చార్జీలు పెంచనవసరం లేదు
  • ఆర్టీసీ ఆస్తులు దక్కించుకునేందుకు కుట్రలు

కామారెడ్డి / భైంసా, వెలుగు: కరెంటు, ఆర్టీసీ చార్జీలను పెంచాలనే కేసీఆర్ సర్కారు నిర్ణయంపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ మండిపడ్డారు. చార్జీల పెంపు ఆలోచన మానుకోవాలని లేకపోతే కేసీఆర్ మెడలు వంచి బీజేపీ దమ్ము చూపిస్తామని హెచ్చరించారు. ఒక్కో లీటర్ పెట్రోలు, డీజిల్ పై ట్యాక్స్ రూపంలో కేసీఆర్ సర్కారు రూ.40 ఖాతాలో వేసుకుంటోందని.. వాటిని తగ్గిస్తే ఆర్టీసీ చార్జీలు పెంచాల్సిన అవసరమే రాదని చెప్పారు. ప్రజా సంగ్రామ యాత్ర 26వ రోజు బుధవారం కామారెడ్డి జిల్లాలో సాగింది. మాచారెడ్డి మండలం భవానిపేట నుంచి లచ్చాపేట వరకు పాదయాత్ర చేశారు. మాచారెడ్డిలో ఏర్పాటు చేసిన సభకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు రేఖా వర్మ హాజరయ్యారు. సభలో బండి సంజయ్ మాట్లాడుతూ.. జీడీపీలో తెలంగాణ దేశంలోనే టాప్ అని పదేపదే చెప్తున్న కేసీఆర్‌కు ఆర్టీసీ, కరెంట్ చార్జీలు పెంచాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ధనిక రాష్ట్రమని చెప్తూ బస్సు చార్జీలు, కరంటు బిల్లులు పెంచుతూ పేదలపై భారం మోపుతున్నారన్నారు. ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేది పేదోళ్లే.. ఆర్టీసీ కార్మికులు పేదోళ్లే.. పేదలపై నిజంగా ప్రేముంటే ట్యాక్సులను తగ్గించుకొని.. చార్జీల పెంచాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్​చేశారు. అమ్మకాల పేరిట ఆర్టీసీ ఆస్తులను దక్కించుకునేందుకు కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆర్టీసీ కార్మిక సంఘాలను చీలుస్తున్నారని ఆరోపించారు. ‘‘కేసీఆర్ ఇండ్ల కరెంటు చార్జీలు భారీగా పెంచి ప్రజల నడ్డి విరవాలని చూస్తుండు. కరెంటు చార్జీలు ఎందుకు పెంచుతున్నారో ప్రజలకు వివరించాలి” అని డిమాండ్ చేశారు. ‘‘ఇందిరా పార్కు వద్ద కొన్ని పార్టీలు ధర్నా చేస్తున్నయ్. ఆ పార్టీలను 80 శాతం డిస్కౌంట్ తో కేసీఆర్​ ఎప్పుడో కొనేసిండు. ఆ పార్టీలు చేస్తున్నవన్నీ టైంపాస్ ధర్నాలే” అని విమర్శించారు.
తెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కారే: రేఖా వర్మ
ప్రజల జోష్ చూస్తుంటే తెలంగాణలో బీజేపీ సర్కారు ఏర్పడుతుందనే విశ్వాసం కలుగుతోందని రేఖా వర్మ అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడితేనే మహిళలకు సంపూర్ణ రక్షణ ఉంటుంది.. మహిళా సాధికారికత బీజేపీతోనే సాధ్యమన్నారు. పాదయాత్రలో జి.మనోహర్ రెడ్డి, ఆలె భాస్కర్, గీతామూర్తి , అరుణతార, వెంకటరమణరెడ్డి, మురళీధర్​గౌడ్​, వేణుగోపాల్​గౌడ్​, సంగప్ప తదితరులు పాల్గొన్నారు.


భైంసా బాధితులకు మేమున్నాం
భైంసా అల్లర్ల బాధిత కుటుంబాలు ఆందోళన చెందొద్దని, అండగా ఉంటామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. పాదయాత్ర లో సంజయ్ ను భైంసా బాధితులు కలిశారు. అమాయక హిందువులను పోలీసులు అకారణంగా అరెస్టు చేసి పీడీ యాక్టులు పెట్టి జైలుకు పంపారని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏడు నెలలుగా జైల్లో ఉంటున్న తమ వారిని విడిపించి ఆదుకోవాలని కోరారు. బెయిల్ రాకుండా చేస్తున్నారని కన్నీరు పెట్టుకున్నారు. బాధిత కుటుంబాల సంరక్షణ బాధ్యత తాను తీసుకుంటానని, జైలు నుంచి బయటకు వచ్చాక ఉపాధి కల్పిస్తానని సంజయ్ వారికి భరోసా ఇచ్చారు.