లిక్కర్ కేసులో వాళ్లంతా నిర్దోషులు కాదు..సాంకేతిక లోపాలతోనే బయటపడ్డరు: ఎన్‌.రాంచందర్‌‌ రావు

లిక్కర్ కేసులో వాళ్లంతా నిర్దోషులు కాదు..సాంకేతిక లోపాలతోనే బయటపడ్డరు: ఎన్‌.రాంచందర్‌‌ రావు

హైదరాబాద్, వెలుగు: లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పు కేవలం సాంకేతిక కారణాలతో వచ్చిన ఊరట మాత్రమేనని బీజేపీ స్టేట్‌ చీఫ్‌ ఎన్.రాంచందర్ రావు అన్నారు. కోర్టు డిశ్చార్జ్ పిటిషన్‌ను అనుమతించినంత మాత్రాన వారు అమాయకులు, నిర్దోషులు కాదని.. ముందుంది ముసళ్ల పండుగ అని పేర్కొన్నారు. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆధ్వర్యంలో డాక్టర్ అనూప్ తదితరులు బీజేపీలో చేరారు. 

ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. కేజ్రీవాల్, కవితకు సంబంధించి సీబీఐ, అడ్వకేట్ల మధ్య తలెత్తిన సాంకేతిక అంశాల ఆధారంగానే కోర్టు ఈ నిర్ణయం తీసుకుందని, ఇది కేవలం ట్రయల్ కోర్టులో జరిగిన ప్రక్రియ మాత్రమేనన్నారు. లిక్కర్ దందాలో వాస్తవాలు లేకపోతే సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు ఎందుకు కాల్చేశారని ప్రశ్నించారు. వాస్తవానికి ఈ స్కామ్‌పై 2022లో మొదట ఫిర్యాదు చేసిందే కాంగ్రెస్ పార్టీ అని, ఆ తర్వాతే 2024లో ఈడీ, సీబీఐ రంగంలోకి దిగాయన్నారు. 

రేవంతుద్దీన్.. అక్బరుద్దీన్ భాయ్ భాయ్.. 

రేవంతుద్దీన్‌, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఇద్దరూ దోస్తులేనని, బయట మాత్రం చిల్లర రాజకీయ నాటకాలాడుతున్నారని రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. యోగి ఆదిత్యనాథ్, రేవంత్ రెడ్డి ఇద్దరూ ముస్లిం వ్యతిరేకులంటూ అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు ఈ డ్రామాలో భాగమేనన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నష్టం జరుగుతుందన్న భయంతోనే, రేవంత్ రెడ్డి స్వయంగా అక్బరుద్దీన్‌తో మాట్లాడి ఇలాంటి వ్యాఖ్యలు చేయిస్తున్నారని ఆరోపించారు. 

ఎంపీ అర్వింద్‌ మాట్లాడుతూ... రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చేసింది లొట్టపీసు ఏమీ లేదని, అవగాహనరాహిత్య పాలన సాగుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు భవిష్యత్తే లేదన్నారు. కవిత బయట ఉన్నా లోపల ఉన్నా తెలంగాణ రాజకీయాలకు ఒరిగేదేమీ లేదన్నారు.