- అప్పటి నుంచి ఎంక్వైరీ చేయించాలి: రాంచందర్‌రావు
- సగం పాపం బీఆర్ఎస్‌ది అయితే.. సగం పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిది
- అవినీతిపై కేంద్ర మంత్రికి లేఖ రాసే నైతిక హక్కు హరీశ్‌రావుకు లేదు
- బీఆర్ఎస్‌ను సుద్దపూసలా చూపించే ప్రయత్నం మానుకోవాలి
- రాష్ట్రాన్ని మొదట భ్రష్టు పట్టించింది బీఆర్ఎస్ పార్టీనే అని ఫైర్
న్యూఢిల్లీ, వెలుగు: సింగరేణి సంస్థలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలంటే.. అది బీఆర్ఎస్ పదేండ్ల పాలన నుంచే మొదలెట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో కూడా సింగరేణిలో అవకతవకలు జరిగిన విషయం అందరికీ తెలుసునని చెప్పారు. ఈ స్కామ్‌లపై విచారణ చేపట్టాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి లేఖ రాసే నైతికహక్కు హరీశ్‌రావుకు లేదన్నారు. ఒకవేళ హరీశ్ రావు నిజంగా ఎంక్వైరీ జరగాలని కోరుకుంటే, ఆ విచారణ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు చేపట్టాల్సి ఉంటుందన్నారు. బీఆర్ఎస్ పార్టీని సుద్దపూసలా చూపించాలని హరీశ్‌రావు ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రాన్ని మొదట బీఆర్‌ఎస్ భ్రష్టు పట్టిస్తే.. ఆ పాపాన్ని కాంగ్రెస్ కొనసాగిస్తున్నదని అన్నారు. తమ లాభాలు, కమీషన్ల కోసం ఆ రెండు పార్టీలూ సింగరేణి కార్మికుల రక్తాన్ని పీల్చాయని, వారి జీవితాలతో, ఉద్యోగాలతో ఆడుకున్నాయని అన్నారు. అందుకే ఈ రెండు పార్టీలు సింగరేణికి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, పార్టీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, తెలంగాణ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఇతరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. సింగరేణి, నైని బ్లాక్, కోల్ టెండర్లలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చేసిన అవినీతిపై సమగ్ర దర్యాప్తు జరగాలన్నారు. బీఆర్ఎస్ పాలనలో సింగరేణి కాంట్రాక్టులు సొంత మనుషులకే ఇచ్చుకున్నారని ఆరోపించారు.
పాపంలో చెరి సగం
సింగరేణి, నైని బ్లాక్ వ్యవహారంలో సగం పాపం గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వానిదైతే, మిగతా సగం పాపం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానిదని రాంచందర్‌రావు ఆరోపించారు. ‘‘ఒకప్పుడు సింగరేణిలో వేలాది మంది ఉద్యోగులు ఉండగా, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల సంఖ్య 42 వేల వరకు తగ్గిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది మరింతగా తగ్గి సుమారు 38 వేలకే పరిమితమైంది. కార్మికుల రక్తం, చెమటతో లాభాల్లో నడిచిన సింగరేణిని పక్కన పెట్టి.. ఈరోజు అదే సింగరేణి పేరుతో వ్యాపారం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. దేశంలోనే అత్యంత లాభాల్లో ఉన్న సంస్థగా గుర్తింపు పొందిన సింగరేణిని ఈరోజు నష్టాల్లో ఉందని చెప్పడం దారుణం. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి రూ.50 వేల కోట్లకు పైగా బకాయిపడి ఉంది”అని వెల్లడించారు. నష్టాల్లో ఉందని చెబుతున్న సింగరేణి నుంచి పుట్‌బాల్ దిగ్గజం మెస్సీ తెలంగాణకు వచ్చిన సందర్భంలో రూ.10 కోట్ల స్పాన్సర్‌షిప్ ఎలా ఇచ్చారు? అని ప్రశ్నించారు. ‘‘లాస్‌లో ఉన్న సంస్థతో ఇంత భారీ ఖర్చులు ఎలా పెట్టారు? దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి” అని డిమాండ్ చేశారు. తమకు సంబంధించిన వారికే టెండర్లు ఇవ్వాలనే కుట్రలో భాగంగానే కాంగ్రెస్ సర్కారు ‘సైట్ విజిట్’ పేరుతో కొత్త విధానం తెచ్చిందని ఆరోపించారు. ఆ పార్టీ పాలనపై కాకుండా..కేవలం కమీషన్లపైనే దృష్టి పెట్టిందని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ జరగకుండా, ఆనాటి ప్రభుత్వం సీబీఐ తెలంగాణలోకి రాకుండా జీవో తెచ్చిందని గుర్తు చేశారు. దీని కారణంగా సీబీఐ దర్యాప్తు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేదా కోర్టు ఆదేశం అవసరమన్నారు. అయితే ఈడీ రైడ్స్ ను అడ్డుకోలేరని.. అనేక కేసుల్లో దర్యాప్తు చేసి, కేసులు కూడా నమోదు చేసిందని చెప్పారు. సింగరేణిలో కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం షేర్ మాత్రమే ఉందని, అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ మొత్తం రాష్ట్ర ప్రభుత్వానిదేనని చెప్పారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఒక్క ఫ్యూన్‌ను కూడా అపాయింట్ చేయలేదని తెలిపారు. సింగరేణి-, కోల్ ఇండియా మధ్య ఉన్న 40 ఏండ్ల ఒప్పందాన్ని ప్రజల ముందు పెట్టాలన్నారు.
బీఆర్ఎస్ ది ఆస్తులు.. కాంగ్రెస్‌ది వాటాల పంచాయితీ
బీఆర్ఎస్ పార్టీలోని నేతలది వారి ఆస్తుల పంపకాల పంచాయితీ అయితే.. కాంగ్రెస్ ది మంత్రుల మధ్య వాటాల గొడవని రాంచందర్‌రావు ఆరోపించారు. రెండేండ్లుగా ఫోన్ ట్యాపింగ్ విచారణ సాగుతూనే ఉందని, ఇందులో అధికారులను మాత్రమే బలి చేశారన్నారు. రాజకీయ నాయకులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. మునుగోడు ఎన్నికల ముందు బీజేపీని ఓడించేందుకు ఫోన్ ట్యాపింగ్ చేశారని, ఇది కాంగ్రెస్‌పై కాదని, బీజేపీపై చేసిన కుట్ర అని పేర్కొన్నారు. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ తర్వాత తెలంగాణపైనే ఫోకస్ ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టంగా చెప్పారన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలో వచ్చాక.. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో తెలంగాణ రూపురేఖలు మారుస్తామని, నిజమైన బంగారు తెలంగాణగా చేస్తామని చెప్పారు.
