- మోదీ 12 ఏండ్ల పాలనపై పుస్తకం అందజేత
హైదరాబాద్, వెలుగు: హీరో, పద్మవిభూషణ్ చిరంజీవిని రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 12 ఏండ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ చేపట్టిన ‘విశేష్ జన సంపర్క్ అభియాన్’ కార్యక్రమంపై చర్చించారు. ఈ సందర్భంగా మోదీ సాధించిన విజయాలు, మైలురాళ్లు, దేశాన్ని ప్రగతిపథంలో తీసుకెళ్లిన కీలక నిర్ణయాలతో కూడిన ప్రత్యేక పుస్తకాన్ని చిరంజీవికి రాంచందర్ రావు అందజేశారు.
వికాస్, విశ్వాస్, జన కల్యాణ్ లక్ష్యాలతో సాగుతున్న కేంద్ర ప్రభుత్వ పాలన తీరును వివరించారు. ఈ భేటీలో దేశాభివృద్ధి, సుపరిపాలనతో పాటు సినీ రంగం, సమాజం, సంస్కృతికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురు చర్చించారు. జాతి నిర్మాణంలో సినీ కళాకారుల పాత్రపై కూడా ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శులు భరత్ ప్రసాద్, బండారు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
