- కాంగ్రెస్‌పై బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు ఫైర్
- ఆర్ఎస్ఎస్ జోలికొస్తే ఊరుకోబోమని హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: దేశాన్ని 60 ఏండ్లు దోచుకున్న కాంగ్రెస్ పార్టీకి దేశభక్తి లేదని, కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం దేశ వ్యతిరేక శక్తులకు వత్తాసు పలుకుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉప్పల్, మల్కాజిగిరి నియోజకవర్గాలకు చెందిన పలువురు నాయకులు ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు.
వారికి పార్టీ కండువా కప్పి రాంచందర్ రావు సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. అసెంబ్లీలో 'వందేమాతరం' పాడుతుంటే ఎంఐఎం ఎమ్మెల్యేలు వాకౌట్ చేసినా కాంగ్రెస్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. స్వాతంత్ర పోరాటానికి ఊపిరిపోసిన వందేమాతరాన్ని అవమానిస్తే కాంగ్రెస్‌కు నోరు రాదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటులో 'జై పాలస్తీనా' అంటే చప్పట్లు కొట్టే కాంగ్రెస్ నేతలు, 'భారత్ మాతాకీ జై' అనడానికి మాత్రం సిగ్గుపడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
ఆర్ఎస్ఎస్ జోలికొస్తే ఊరుకోం..
ఆర్ఎస్ఎస్ సంస్థను బ్యాన్ చేయాలన్న కాంగ్రెస్ డిమాండ్‌పై రాంచందర్ రావు మండిపడ్డారు. అమెరికాకు చెందిన పక్షపాత సంస్థ యూఎస్సీఐఆర్ఎఫ్ నివేదికలను పట్టుకుని కాంగ్రెస్ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. మన దేశ గూఢచారి సంస్థ 'రా' ను రద్దు చేయాలని చెప్పే సంస్థలకు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? అని నిలదీశారు. లష్కరే తోయిబా కంటే హిందూ గ్రూపులే ప్రమాదకరమని చెప్పే రిపోర్టులను కాంగ్రెస్ సమర్థించడం ఆ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు.
రాహుల్ గాంధీ ఎప్పుడూ చేతిలో రాజ్యాంగ పుస్తకం పట్టుకుని తిరుగుతుంటారు కానీ, ఆయనకు అందులోని అంశాలపై అవగాహన లేదని రాంచందర్ రావు విమర్శించారు. రాహుల్ గాంధీ ఒక్కసారి రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఏ చదవాలని, ప్రాథమిక విధులను విస్మరించి దేశ వ్యతిరేక శక్తులకు మద్దతు తెలపడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని స్పష్టం చేశారు.
గ్యాస్ సిలిండర్ల ధరలపై కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని ఫైర్ అయ్యారు. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయం సాధించిందని తెలిపారు. గతంలో 12 స్థానాలు ఉంటే, ఇప్పుడు 22 సీట్లను గెలుచుకోవడం ప్రధాని మోదీ నాయకత్వానికి దక్కిన ప్రజాదరణకు నిదర్శనమన్నారు. రాజ్యసభకు ఎన్నికైన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, బీహార్ సీఎం నితీశ్ కుమార్‌లకు శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు సంగప్ప, తాడూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
