జూబ్లీ హిల్స్ బాలిక కేసును సీబీఐకి అప్పగించాలె

జూబ్లీ హిల్స్ బాలిక కేసును సీబీఐకి అప్పగించాలె

హైదరాబాద్: రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తోందని బీజేపీ రాష్ట్ర ఇంచార్జీ తరుణ్ చుగ్ విమర్శించారు. బుధవారం ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో కలిసి తరుణ్ చుగ్ మాట్లాడుతూ... రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, కేసీఆర్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిందని ఫైర్ అయ్యారు. జూబ్లీ హిల్స్ మైనర్ బాలిక ఘటన బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో పోలీసులను రాజకీయ పావులుగా వాడుకుంటున్నారని, నేరస్థులను కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తమ వాళ్ల తప్పులను కప్పి పుచ్చడానికి , వాళ్లను కాపాడడానికి కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారన్న ఆయన... బాలికకు న్యాయం చేయాలని పోరాటం చేస్తున్న తమ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. కొంత కాలంగా ఇలాంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నా... ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో అసమర్థ పాలన నడుస్తోందన్న ఆయన... సీఎం ఫామ్ హౌజ్, ఆయన కుమారుడు కేటీఆర్ ట్విట్టర్, హోం మంత్రి సెలవుల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. 109 కోట్ల ఖర్చుతో సొంత డబ్బా ప్రచారం చేసుకున్నారని మండిపడ్డారు. ప్రజలను తమ ఆఫీసుల చుట్టూ తిప్పించుకుంటున్నారని, దీనికి కేసీఆర్ ప్రభుత్వం పరిహారం చెల్లించక తప్పదని హెచ్చరించారు. మైనర్ బాలిక కేసును సీబీఐకు అప్పగించాలని డిమాండ్ చేశారు.