నాణ్యమైన ఆహారం అందించడంలో ప్రభుత్వం విఫలం

నాణ్యమైన ఆహారం అందించడంలో ప్రభుత్వం విఫలం

హైదరాబాద్: సీఎం కేసీఆర్ కు రాజకీయాల మీదున్న శ్రద్ధ విద్యార్థుల భవిష్యత్ పై లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 40 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురికావడం ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు. సీఎం కేసీఆర్ దేశరాజకీయాలు పక్కనపెట్టి.. గురుకులాల్లో విద్యార్ధుల అవస్థలపై దృష్టి పెట్టాలన్నారు. గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా...  కేసీఆర్ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఆశ్రమ పాఠశాలల్లో నాణ్యమైన ఆహారం అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని,  అవసరమైతే హైదరాబాద్ కు షిఫ్ట్ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. 

వరంగల్ జిల్లా వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు ఫుడ్ పాయిజనింగ్  జరిగింది. రాత్రి భోజనం చేసిన తర్వాత 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని మొదట వర్ధన్నపేట ఆస్పత్రికి తరలించారు. అయితే పలువురు విద్యార్థులకు సీరియస్ గా ఉండడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు