ఫామ్ హౌజ్, ప్రగతిభవన్ లో ఉండేందుకేనా కేసీఆర్ ను సీఎం చేసింది..? 

ఫామ్ హౌజ్, ప్రగతిభవన్ లో ఉండేందుకేనా కేసీఆర్ ను సీఎం చేసింది..? 

పేదోళ్ల బతుకులు బాగు పడాలంటే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదేశాలతో.. ప్రజల సమస్యలు, కష్టాలను తెలుసుకునేందుకే తాను ‘ప్రజా సంగ్రామ యాత్ర’ చేస్తున్నానని చెప్పారు. ఉమ్మడి రాష్ర్టంలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు, రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ కు గతంలో అవకాశాలు ఇచ్చారని, ఈసారి మాత్రం బీజేపీకి అవకాశం ఇవ్వాలంటూ కోరారు. బండి సంజయ్ చేపట్టిన ‘ప్రజా సంగ్రామ యాత్ర’ (నాలుగో విడత) కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాలనగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో కొనసాగుతోంది. బండి సంజయ్ పాదయాత్రలో పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు పాల్గొంటున్నారు. ఇవాళ రాత్రి బాలనగర్ సమీపంలో బండి సంజయ్ బస చేయనున్నారు. 

అక్రమ కేసులతో వేధిస్తున్నారు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని చెరువులను కూడా అధికార పార్టీ నాయకులు కబ్జా చేశారని బండి సంజయ్ ఆరోపించారు. చెరువులు, నాళాలు, ప్రభుత్వ భూములు, పేదల ఇండ్లను కూడా వదిలిపెట్టకుండా కబ్జాలు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితే తమపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వని సీఎం కేసీఆర్.. తన కుటుంబంలో మాత్రం ఉద్యోగాలు ఇచ్చుకున్నారని అన్నారు. 

అర్హులందరికీ ఇండ్లు కట్టిస్తాం
రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులందరికీ ఇండ్లు కట్టించి ఇస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. ఉచిత విద్య, వైద్యం కూడా అందిస్తామన్నారు. ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థులకు నాణ్యత లేని భోజనం, పురుగుల అన్నం పెడుతున్నారని, కలుషిత ఆహారం తిని చాలామంది విద్యార్థులు తరచూ అస్వస్థతకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం CHCలో ఒక గంటలోనే 34 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారని, వారిలో నలుగురు మహిళలు చనిపోతే, బాధిత కుటుంబాలను ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోలేదని చెప్పారు. 

వీఆర్ఏల డిమాండ్లు నెరవేర్చాలి
రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల హామీలు ఏమయ్యాయని బండి సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2 లక్షల 40 వేల ఇండ్లను కేంద్రం మంజూరు చేస్తే.. కేసీఆర్ వాటిని కట్టించడం లేదన్నారు. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఆత్మహత్య చేసుకున్న వీఆర్ఏలు, ఆర్టీసీ కార్మికుల కుటుంబాలను పరామర్శించడం లేదన్నారు. వీఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.  కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తూ.. సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో ఏడాది పాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, ఆ తర్వాత రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వమే వస్తుందన్నారు. ఫామ్ హౌజ్, ప్రగతి భవన్ లో ఉండేందుకేనా కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేసిందని ప్రశ్నించారు. 

ఏ గ్రామంలో చూసినా నాలుగు, ఐదు వరకు మద్యం షాపులే కనిపిస్తున్నాయని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ కుటుంబం ఏ స్కామ్ ను విడిచిపెట్టడం లేదని ఆరోపించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు. కేసీఆర్ అవినీతి గురించి ఎంత చెప్పినా తక్కువే అంటూ వ్యాఖ్యానించారు. నూతన పార్లమెంటు భవనానికి బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరు పెట్టాలంటూ తనకు ఇప్పటికే చాలా వినతి పత్రాలు వచ్చాయని చెప్పారు.