నిందితులను కాపాడేందుకు ప్రయత్నం

నిందితులను కాపాడేందుకు ప్రయత్నం

హైదరాబాద్: జూబ్లీ హిల్స్ బాలిక కేసు నిందితులను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీజేపీ ఎంపీ, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు.  బుధవారం ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ... జూబ్లీ హిల్స్ ఘటన పథకం ప్రకారం, కసితో చేసిందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ చేతగానితనం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, ఇంత జరుగుతున్న సీఎం స్పందించకపోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. బీజేపీ ఆందోళన వల్లే ప్రభుత్వంలో ఈ మాత్రం కదలిక వచ్చిందన్నారు. ఆధారాలను తారుమారు చేసి కేసును నిర్వీర్యం చేసేందుకు సీఎంవో సాక్షిగా కుట్ర జరిగిందని ఆరోపించారు. అందుకు అసలు నిందితులను కేసు చివర్లో చేర్చడమే నిదర్శమన్నారు. ఎమ్మెల్యే కుమారుడు లేడని తొలుత చెప్పిన పోలీసులు... అనంతరం ఎలా అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. అత్యాచార ఘటనలను రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు మతం కోణంలో చూస్తున్నారన్న ఆయన... తమకు అందరూ సమానమేనని స్పష్టం చేశారు. మతం పేరుతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారే తప్ప... చర్యలు తీసుకునే ఉద్దేశం కేసీఆర్ కు లేదన్నారు. గత వారం రోజుల్లో 7 మంది బాలికలపై అఘాయిత్యం జరిగితే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. జూబ్లీ హిల్స్ బాధితురాలికి న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.