V6 News

స్పోర్ట్స్ తోనే జాతీయ సమైక్యత

స్పోర్ట్స్ తోనే జాతీయ సమైక్యత

హైదరాబాద్, వెలుగు: జాతీయ సమైక్యతను, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే శక్తి ఒక్క ఆటలకే ఉందని, అందుకే ప్రధాని మోదీ 2014తో పోలిస్తే క్రీడల బడ్జెట్‌‌ను ఏకంగా 130 రెట్లు పెంచారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. శుక్రవారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన 41వ జాతీయ సీనియర్ క్యోరుగి(తైక్వాండోలో ఒక ఫైటింగ్ ఈవెంట్) చాంపియన్‌‌ షిప్‌‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశం నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనలో యువత, క్రీడలే కీలకమని, దేశ నిర్మాణంలో క్రీడలను ఒక శక్తివంతమైన ఆయుధంగా మార్చేందుకు కేంద్రం కృషి చేస్తోందన్నారు. 

ఒకప్పుడు ఒలింపిక్స్‌‌లో మనోళ్లు కాంస్య పతకం గెలవడమే గగనంగా ఉండేదని, కానీ ఇప్పుడు మన ప్లేయర్లు గోల్డ్, సిల్వర్ మెడల్స్ కొల్లగొడుతున్నారని అన్నారు. అంతకుముందు అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ వంటి దూర ప్రాంతాల నుంచి వచ్చిన అథ్లెట్లకు ఆయన ప్రత్యేక స్వాగతం పలికారు. 2001–02లో నిర్మించిన ఈ స్టేడియం ఎన్నో అంతర్జాతీయ ఈవెంట్లకు వేదికైందన్నారు. ‘‘మీరు ఆటల్లో గెలవడమే కాదు.. హైదరాబాద్‌‌ను కూడా చుట్టిరండి. ఇక్కడి ఆతిథ్యం చాలా బాగుంటుంది. ప్రపంచంలోనే ఫేమస్ అయిన హైదరాబాద్ దమ్ బిర్యానీ రుచి చూడాల్సిందే’’ అని అథ్లెట్లకు రాంచందర్ రావు సూచించారు.