- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఆ పార్టీ ఘోరంగా విఫలమైందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆ పార్టీ దివ్యాంగుల సెల్ రాష్ట్ర కన్వీనర్ కొల్లి నాగేశ్వర్ రావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాంచందర్రావు మాట్లాడారు.
దివ్యాంగుల పెన్షన్‌ను రూ. 4 వేల నుంచి రూ.6 వేలకు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చినా, అధికారంలోకి వచ్చాక దాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యం చూపిందని తెలిపారు. దివ్యాంగులు సమాన హక్కులు, గౌరవం, అవకాశాలు పొందేలా బీజేపీ కృషి చేస్తుందని చెప్పారు. ట్రైసైకిళ్లు, హియరింగ్ ఎయిడ్లు తదితర పరికరాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నదని పేర్కొన్నారు. దివ్యాంగుల ఉపాధి అవకాశాల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. దివ్యాంగుల హక్కులను కాపాడే పార్టీ బీజేపీ ఒక్కటేనని, రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దివ్యాంగులు బీజేపీకి మద్దతివ్వాలని కోరారు.
