బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎవరు? రేసులో రాజా సింగ్, పాయల్ శంకర్, మహేశ్వర్ రెడ్డి

బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎవరు? రేసులో రాజా సింగ్, పాయల్ శంకర్, మహేశ్వర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 8 నుంచి ప్రారంభం కానుండడంతో ఈసారైనా బీజేపీ ఫ్లోర్ లీడర్  ఎంపిక కొలిక్కి వచ్చేనా అన్న చర్చ జోరుగా సాగుతోంది. అన్ని పార్టీలు ఫ్లోర్ లీడర్ లను నియమించుకోగా, బీజేపీ మాత్రమే ఫ్లోర్ లీడర్ లేని పార్టీగా అసెంబ్లీలో నిలిచింది. ఆ పార్టీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ బీసీ సీఎం నినాదాన్ని ఎత్తుకోవడంతో ఇప్పుడు కనీసం ఎల్పీ నేత ఎంపిక విషయంలో అయినా బీసీని పరిగణనలోకి తీసుకోవాలన్న డిమాండ్  పార్టీలో వినిపిస్తోంది.

బీజేపీలో ఇద్దరు బీసీలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వారిలో ఒకరు గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్, ఇంకొకరు ఆదిలాబాద్  ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఆ ఇద్దరిలో ఒకరికి ఫ్లోర్ లీడర్  ఇవ్వడంపై చర్చ సాగుతోంది. రాజా సింగ్ కు ఎమ్మెల్యేగా అనుభవం ఉన్నా ఆయనకు తెలుగు భాషపై పట్టు లేకపోవడం, అసెంబ్లీ రూల్స్ పై కూడా పూర్తి అవగాహన లేకపోవడం వంటి కారణాలు మైనస్  అని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక పాయల్ శంకర్  మొదటి నుంచి బీజేపీలో ఉన్న నేత కావడంతో బీసీ కోటాలో ఆయనకే ఫ్లోర్  లీడర్  దక్కవచ్చని చర్చ సాగుతోంది. రాష్ట్రానికి చెందిన జాతీయ స్థాయి బీసీ నేత ఒకరు.. శంకర్ కే ఫ్లోర్ లీడర్ ఇవ్వాలని ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలిసింది.

అయితే ఆయన మొదటిసారి ఎమ్మెల్యే కావడం ఫ్లోర్ లీడర్  పదవికి కొంత అడ్డురావచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే, నిర్మల్  ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డికి ఎల్పీ లీడర్  ఇచ్చేందుకు రాష్ట్ర బీజేపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్న ఒకరు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఒకసారి ఆయన ఎమ్మెల్యేగా పనిచేయడం, ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మహేశ్వర్ రెడ్డియే చర్చల్లో ఎక్కువగా పాల్గొన్నారు. ఒకరకంగా చెప్పాలంటే అనధికారిక ఫ్లోర్ లీడర్ గా ఆయన వ్యవహరించడంతో ఆయనకే ఎల్పీ బాధ్యతలు అప్పగించవచ్చని పార్టీలో చర్చ సాగుతోంది. మరి ఈ విషయంలో హైకమాండ్  ఆలోచన ఏ రీతిలో ఉంటుందో రాష్ట్ర బీజేపీలో ఆసక్తికరంగా మారింది.