
- టీఆర్ఎస్పై దూకుడు పెంచిన బీజేపీ
- అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ముందుకు
- గులాబీ నేతల విమర్శలకు దీటైన కౌంటర్
రాష్ట్రంలో బీజేపీ నేతలు దూకుడు పెంచారు. టీఆర్ఎస్ టార్గెట్‌గా ‘మిషన్ 2023’ మొదలుపెట్టారు. అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ప్లాన్ అమలు చేస్తున్నారు. తమకు ఒక్క శాతం ఓట్లు కూడా లేని త్రిపురలో మూడింట రెండొంతుల మెజార్టీతో అధికారంలోకి వచ్చామని, అదే రీతిలో రాష్ట్రంలోనూ పవర్లోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ చీఫ్ అమిత్ షా.. రాష్ట్రంలో పార్టీ సభ్యత్వాలను ప్రారంభించి కేడర్‌లో ఉత్తేజం నింపారు. ఒకవైపు మెంబర్షిప్ డ్రైవ్ వేగంగా చేపడుతూనే.. అధికార పార్టీ నేతల విమర్శలకు అదే స్థాయిలో కమలనాథులు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. టీఆర్ఎస్పై ప్రజల్లో రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతోందని, ఇందుకు మొన్నటి లోక్‌సభ ఎన్నికలే నిదర్శనమని అంటున్నారు. ‘సారు.. కారు.. పదహారు.. ఢిల్లీ సర్కార్’ నినాదాన్ని ప్రజలు పట్టించుకోలేదని, ఏడు ఎంపీ సీట్లలో టీఆర్ఎస్ ఓడిందంటే దాని అర్థం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. శనివారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి, నేతలు దత్తాత్రేయ, డీకే అరుణ, నల్లు ఇంద్రసేనారెడ్డి తదితరులు కేసీఆర్‌పై, టీఆర్ఎస్పై ఫైర్ అయ్యారు. పంద్రాగస్టు నుంచి అసలైన పాలన ఉంటుందని చెప్తుతున్న కేసీఆర్.. మరి ఇన్నాళ్లూ నకిలీ పాలన చేశారా అని నిలదీశారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని కామన్ పబ్లిక్ కూడా చర్చించుకుంటున్నారని తెలిపారు. టీఆర్ఎస్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతామని స్పష్టం చేశారు.
అట్లయితే నీ పదవి ఎవరూడబీకాలె?
హరితహారం కింద నాటిన మొక్కలు బతికించకపోతే సర్పంచ్‍ల పదవులు ఊడవీకేస్తా అంటున్నవ్. ఆ మొక్కలు నాటిన నీ(కేసీఆర్) ఎమ్మెల్యేలు, నీ మంత్రుల్లో ఎంతమంది పదవులు ఊడగొట్టినవ్? నువ్వు నాటిన మొక్కలు కూడా చనిపోయినయ్. మరి నీ సీఎం పదవి ఎవరు ఊడగొట్టాలె? డిప్యూటీ ప్రధాని కావాలన్న నీ కల చెదిరిపోయే మోడీపై విమర్శలు చేస్తున్నవ్.
– డీకే అరుణ, బీజేపీ నాయకురాలు
ఇన్నాళ్లు నకిలీ పాలన చేసినవా?
ఆగస్టు 15 తర్వాత అసలైన పాలన చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. మరి ఇన్నాళ్లూ ఆయన నకిలీ పాలన చేశారా? రాష్ట్రంలో అనేక ప్రభుత్వ శాఖల్లో అవినీతి భారీగా పెరిగిపోయింది. వీటిపై సీబీఐ విచారణ కోరే ధైర్యం ముఖ్యమంత్రికి లేదు. కాంగ్రెస్ తల్లీకొడుకుల పార్టీ అయితే.. టీఆర్‌ఎస్ తండ్రీకొడుకుల పార్టీ. కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నరు.’’
– బండారు దత్తాత్రేయ, కేంద్ర మాజీ మంత్రి
రాష్ట్రంలో 2023 టార్గెట్‌గా బీజేపీ ముందుకు వెళ్తున్నదని, వచ్చే ఎన్నికల్లో తమదే గెలుపని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. షెడ్యూల్ ప్రకారమే 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, ముందస్తు ఎన్నికల కోసం తామేమీ తొందరపడటం లేదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్పై రాష్ట్ర ప్రజల్లో వ్యతిరేకత ఉందని, వారు బలంగా మార్పును కోరుకుంటున్నారని చెప్పారు. తాము ఎలాంటి మాస్టర్ ప్లాన్లు అమలు చేయడం లేదని, తెలంగాణ ప్రజలే మాస్టర్ ప్లాన్ అని తెలిపారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కిషన్ రెడ్డి మొదటిసారిగా శనివారం హైదరాబాద్ లోని హరిత ప్లాజాలో మీడియాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చిట్‌చాట్‌లో మాట్లాడారు. ‘‘తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నరు. 2023లో బీజేపీ రావాలని కామన్ పబ్లిక్ కూడా చర్చించుకుంటున్నరు. ఆఫీసర్స్‌లో చూసుకున్న, యూత్‌ను తీసుకున్న, మహిళలను తీసుకున్న అదే చర్చ. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని అంటున్నరు. ఇది రానున్న రోజుల్లో చాలా పెద్ద ఎత్తున మార్పునకు సంకేతం” అని తెలిపారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ‘సారు.. కారు.. పదహారు.. ఢిల్లీ సర్కార్’ అనే నినాదంతో ముందుకు పోయిందని, ఆ నినాదం ఏమైందో అందరికీ తెలుసని విమర్శించారు. పదహారు సీట్లలో గెలుస్తామని చెప్పి ఏడు సీట్లలో ఓడిపోయిందని అని అన్నారు. ప్రజలు మార్పు కోరుకున్నప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు, కేసీఆర్ సారు, కేటీఆర్ సారు.. ఇవన్నేమీ చూడబోరని ఆయన పేర్కొన్నారు. ‘‘త్రిపురలో ఒకప్పుడు మాకు ఒక్క శాతం ఓట్లు కూడా రాలేదు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు మూడింట రెండొంతుల మెజార్టీతో అధికారంలోకి వచ్చాం. దేశంలో చాలా రాష్ట్రంలో ఇలా అధికారంలోకి వచ్చాం. ప్రజలు మార్పు కోరుకున్నప్పుడు తప్పకుండా మార్పు జరుగుతుంది” అని అన్నారు. రాబోయే రోజుల్లోనూ తెలంగాణలోనూ మార్పు జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
నైతికత గురించి కేసీఆరా మాట్లాడేది?
ఇక్కడ ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలతో విసిగిపోయారని కిషన్రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్ మరోసారి గెలిచే అవకాశం లేదని, తాము అభివృద్ధి ఎజెండాతోనే ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ‘‘టీఆర్ఎస్ విధానాల పట్ల ప్రజల్లో రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతోంది. తెలంగాణలోనే కాదు దేశంలో ఎక్కడ కూడా మేము మతం గురించి చెప్పలేదు. మతం పేరు మీద గెలువలే. టీఆర్ఎస్ పార్టీ ఏడుసీట్లుమతం పేరుతో ఓడిపోయిందా? మతాన్ని అడ్డం పెట్టుకొని బీజేపీ గెలిచిందని కేసీఆర్ చెప్పడం గురివింద సామెతే” అని అన్నారు. పక్కన మజ్లిస్‌ను పెట్టుకున్న కేసీఆర్ తమను విమర్శించడం ఏమిటని మండిపడ్డారు. ‘‘ఒక పక్క అక్బరుద్దీన్ ఒవైసీని.. ఇంకోపక్క అసదుద్దీన్ ఒవైసీని కూర్చోబెట్టుకొనే వ్యక్తికి మతం గురించి మాట్లాడే నైతికత ఎక్కడిది? ఆయనకు బీజేపీని విమర్శించే నైతిక హక్కు ఎక్కడిది?” అని నిలదీశారు. పశ్చిమ బెంగాల్ లో కూడా అక్కడి సీఎం మమతా బెనర్జీ వైఫల్యాలు, ఆమె ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, మార్పు రావాలని ప్రజలు కోరుకోవడంతోనే ఆ రాష్ట్రంలో బీజేపీ ఘన విజయం సాధించిందని వివరించారు. కేసీఆర్ సర్కార్ పై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత, తాము అనుసరిస్తున్న డెవలప్మెంట్ ఎజెండాతో ఇక్కడ నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకోగలిగామని, రానున్న రోజుల్లోనూ ఇది మంచి మార్పునకు సంకేతమని తెలిపారు.
నార్త్ బ్లాక్‌తో అన్ని పోలీస్స్టేషన్ల కనెక్టివిటీ
దేశంలోని అన్ని పోలీస్‌స్టేషన్‌లోని నెట్‌వర్క్‌ను ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో గల కేంద్ర హోంశాఖ నెట్‌వర్క్‌తో కనెక్టివిటీ చేస్తున్నామని కిషన్రెడ్డి చెప్పారు. ఈ ప్రక్రియ 60 నుంచి 70 శాతం వరకు పూర్తయిందని, ఈ నెలాఖరు వరకు అంతా పూర్తవుతుందని తెలిపారు. దేశంలో ఏ పోలీస్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైనా తమ వద్ద రికార్డు అవుతుందన్నారు. మహిళల రక్షణకు ప్రత్యేక చట్టాలు రూపొందిస్తున్నామని చెప్పారు. మహిళలపై దాడులను, రేప్‌లను అరికట్టేందుకు కఠిన చట్టాలు తీసుకురాబోతున్నామని, పోక్సో చట్టంలో మార్పులు తెస్తామని తెలిపారు. సైబర్ క్రైం విషయంలోనూ కొత్త చట్టాలను తీసుకురాబోతున్నామన్నారు.
అక్రమంగా ఉన్నవారిని పంపేస్తం
దేశంలో అక్రమంగా ఉన్న విదేశీయులను గుర్తించి, గౌరవప్రదంగా వాళ్ల దేశాలకు పంపించేస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా కిషన్రెడ్డి బదులిచ్చారు. ‘‘హైదరాబాద్‌లోనే కాదు.. దేశమంతా ఎక్కడైనా సరే ఇల్లీగల్‌గా ఉన్న ఫారినర్స్‌ను పంపించేస్తం. ఈ విషయంలో రాష్ట్రంలో ఆడిట్ కూడా లేదు.. ఎవరైనా రావొచ్చు.. ఎవరైనా పోవచ్చు అన్నట్లు ఉంది. ఎవరైతే ఏంది ఓటర్లయితే చాలు అన్న ఆలోచన ఉన్నప్పుడు బీజేపీ తప్పకుండా నిర్ణయం తీసుకుంటుంది” అని స్పష్టం చేశారు. పార్లమెంట్ లో చాలా బిల్లులు ప్రవేశపెట్టాల్సి ఉన్నందున వచ్చే నెల 2 వరకు పార్లమెంట్ సమావేశాలను పొడిగించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
మున్సి‘పోల్స్’లోనూ లోక్‌సభ ఫలితాలే: రాంచందర్ రావు
కిషన్రెడ్డి కన్నా ముందు బీజేపీ నగర అధ్యక్షుడు రాంచందర్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ కు భంగపాటు తప్పదన్నారు. ఎంపీ ఎన్నికల్లో ఎదురైన ఫలితాలే ఈ ఎన్నికల్లోనూ వస్తాయని చెప్పారు. ‘కారు.. సారు.. పదహారు.. ఢిల్లీలో సర్కారు’ నినాదం టీఆర్ఎస్ ను బోల్తా కొట్టించిందని, ఇప్పుడు కూడా అదే జరగబోతందని పేర్కొన్నారు.
గవర్నర్‌తో కిషన్రెడ్డి భేటీ
హైదరాబాద్, వెలుగు: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి శనివారం గవర్నర్ నరసింహన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మధ్యాహ్నం రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆయన గవర్నర్‌ను సత్కరించారు. ఈ సందర్భంగా జాతీయ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై వారిద్దరు చర్చించినట్టు తెలిసింది.