జిల్లాల పేర్లు మారిస్తే ఊకోం..ఇష్టారీతిన పేర్లు పెడ్తామంటే నడ్వదు: రాంచందర్‌‌‌‌రావు

జిల్లాల పేర్లు మారిస్తే ఊకోం..ఇష్టారీతిన పేర్లు పెడ్తామంటే నడ్వదు: రాంచందర్‌‌‌‌రావు
  •     మీడియాతో చిట్‌‌చాట్‌‌లో  బీజేపీ స్టేట్‌‌ చీఫ్‌‌ కామెంట్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన, పేర్ల మార్పు విషయంలో కాంగ్రెస్‌‌ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని బీజేపీ స్టేట్‌‌ చీఫ్‌‌ రాంచందర్‌‌‌‌రావు మండిపడ్డారు. ఇష్టారీతిన పేర్లు మారుస్తామంటే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. ముందుగా ఆల్‌‌పార్టీ మీటింగ్‌‌ పెట్టి చర్చించాలని, ఆపై పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నాకే పేర్ల మార్పులపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. 

ఆయన మంగళవారం హైదరాబాద్‌‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో చిట్‌‌చాట్‌‌ చేశారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు డ్రామాలాడుతున్నాయని రాంచందర్‌‌‌‌రావు ఆరోపించారు. నీళ్ల సమస్యల పేరుతో మరోసారి తెలంగాణ సెంటిమెంట్‌‌ రగిల్చి పబ్బం గడుపుకోవాలని రెండు పార్టీలు చూస్తున్నాయని కామెంట్‌‌ చేశారు. 

‘‘నీటి విషయంలో సామరస్య పరిష్కారం అంటూ సుప్రీం కోర్టుకు ఎందుకు పోయారు? అక్కడ కేసు ఎందుకు వేశారు.. మళ్లీ ఎందుకు విత్ డ్రా చేసుకున్నారు? దీనికి కాంగ్రెస్ సమాధానం చెప్పాలి”అని డిమాండ్‌‌ చేశారు. చిత్తశుద్ధితో పనిచేస్తే రాష్ట్రాల మధ్య నీటి సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. గతంలో వాజ్‌‌పేయి హయాంలో కావేరీ ఇష్యూ సాల్వ్ అయ్యిందని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు కూడా నీళ్ల పంచాయితీకి పర్మినెంట్ సొల్యూషన్ బీజేపీతోనే సాధ్యమన్నారు. తెలంగాణకు నష్టం జరిగితే తాము రాష్ట్రం వైపు, ప్రజల వైపే ఉంటామని చెప్పారు.