ఇయ్యాల బీజేపీ టిఫిన్ బాక్స్ మీటింగ్​లు

ఇయ్యాల బీజేపీ టిఫిన్ బాక్స్ మీటింగ్​లు
  • ఇయ్యాల బీజేపీ టిఫిన్ బాక్స్ మీటింగ్​లు
  • 119 నియోజకవర్గాల్లో పాల్గొననున్న పార్టీ నేతలు
  • పెద్దపల్లిలో మీటింగ్ నిర్వహించనున్న  మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా 119 అసెం బ్లీ  నియోజకవర్గాల్లో ఆదివారం బీజేపీ టిఫిన్ బాక్స్ మీటింగ్​లు నిర్వహించనుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ కీలక నేతలు ఈ మీటింగ్​లో పాల్గొననున్నారు. ప్రతి సెగ్మెంట్​కు ఓ నేతను ఇన్​చార్జిగా నియమించారు. వారు తమ ఇంటి నుంచి టిఫిన్ బాక్స్ తెచ్చుకొని ఆయా నియోజకవర్గాల్లోని ఒక చౌరస్తాలో సమావేశమవుతారని పార్టీ ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. టిఫిన్  తింటూ తమ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలపై చర్చించుకుంటారన్నారు. ఒక్కో సెగ్మెంట్​లో కనీసం 200 మంది కంటే తక్కువ కాకుండా పాల్గొంటారని ఆమె  వెల్లడించారు. 

ఎంపీ బండి సంజయ్​ని కరీంనగర్, ఎంపీ లక్ష్మణ్​ను ముషీరాబాద్, అరవింద్​ను ఆర్మూర్, సోయం బాపురావును బోథ్, ఈటల రాజేందర్​ను హుజూరాబాద్, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డిని జనగామ, డీకే అరుణను గద్వాల, జితేందర్ రెడ్డిని మహబూబ్ నగర్, వివేక్ వెంకట స్వామిని పెద్దపల్లి, రాజగోపాల్ రెడ్డిని మునుగోడు, ఇంద్రసేనా రెడ్డిని మలక్​పేట, చింతల రాంచంద్రా రెడ్డిని ఖైరతాబాద్ నియోజకవర్గాలకు ఇన్ చార్జులుగా నియమించారు. ఈ సందర్భంగా ఆదివారం పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి టిఫిన్ బైఠక్  సమావేశంలో పాల్గొననున్నారు.

ఈ నెల 18న నిరసనలు

రైతులకు లక్ష రుణమాఫీ హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18న పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసన,  ఆందోళన కార్యక్రమాలను చేపడుతున్నామని బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్  రెడ్డి తెలిపారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2018 ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం లక్ష రూపాయల వరకు రైతుల అన్ని రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. లక్ష మాఫీచేసే వరకు పోరాటాలు చేస్తుంటామని ఆయన వెల్లడించారు.