- 30న రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోకూడదని బీజేపీ నిర్ణయించింది. అన్ని వార్డులు, గ్రామ పంచాయతీల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని ప్రకటించింది. ఈ నెల 30న విస్తృత స్థాయి రాష్ట్ర సమావేశం నిర్వహించాలని డిసైడ్ అయింది.
దీనికి ఆ పార్టీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ అటెండ్ కానున్నారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో లోకల్ బాడీ ఎన్నికల సన్నాహక సమావేశం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, సైదిరెడ్డి, రాష్ట్ర నేతలు చంద్రశేఖర్ తివారి, కాసం వెంకటేశ్వర్లు, వీరేందర్ గౌడ్, ఆనంద్ గౌడ్ తదితరులు హాజరయ్యారు.
సమావేశం అనంతరం ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. గ్రామ పంచాయతీలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నాశనం చేసి అప్పుల ఊబిలోకి నెట్టిందని, ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని పంచాయతీ ఎన్నికలకు వెళ్తుందని ఆయన ప్రశ్నించారు.
గడిచిన రెండేండ్లలో పల్లెలు ఆగం అయ్యాయని, కేంద్ర నిధుల వల్లే పంచాయతీలు బతుకుతున్నాయని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ పంచాయతీలతో చెలగాటమాడితే.. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి వాటిని మరింత దిగజార్చారని ఆరోపించారు. కామారెడ్డి డిక్లరేషన్ ఒక బూటకమని తేలిపోయిందని, బీసీలపై కాంగ్రెస్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల కోసమే రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా ఎన్నికలు నిర్వహిస్తోందని విమర్శించారు.
