గోవాలో కొలువుదీరనున్న బీజేపీ ప్రభుత్వం

గోవాలో కొలువుదీరనున్న బీజేపీ ప్రభుత్వం

గోవాలో భాగస్వామ్య పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ ప్రకటించింది. ఎంజీపీకి చెందిన ఇద్దరు, మరో ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు తమకు మద్దతు ప్రకటించినట్లు బీజేపీ స్టేట్ ఇంచార్జ్ దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. ఎంజీపీ ఇప్పటికే మద్దతు లేఖను కూడా ఇచ్చినట్లు ఆయన చెప్పారు. వారితో కలుపుకొని మొత్తం 25 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉన్నట్లు ఫడ్నవీస్ స్పష్టం చేశారు. గోవాలో సోమవారం కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్నట్లు సమాచారం.

గోవాలో సొంతంగా అధికారం చేపట్టేందుకు అవసరమైన మేజిక్ ఫిగర్కు బీజేపీ కేవలం ఒక్క సీటు దూరంలో నిలిచింది. మొత్తం 40 అసెంబ్లీ స్థానాల్లో 20 సీట్లు గెలుచుకున్న కమలదళం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. 2017 ఎన్నికల్లో కేవలం 13 స్థానాల్లో మాత్రమే విజయం సాధించిన బీజేపీ.. ఈసారి వాటితో పాటు మరో 7 స్థానాలను ఖాతాలో వేసుకుంది. గత ఎన్నికల్లో 20 స్థానాల్లో పాగా వేసిన కాంగ్రెస్.. ఈసారి 11 సీట్లకే పరిమితమైంది. ఆమ్ ఆద్మీ పార్టీ 2 స్థానాల్లో బోణీ చేయగా.. ఇండిపెండెంట్లు 3, ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించారు.