వచ్చే నెల 5 నుంచి రాష్ట్రంలో బీజేపీ యాత్రలు

వచ్చే నెల 5 నుంచి రాష్ట్రంలో బీజేపీ యాత్రలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో  పది సీట్లు గెలువాలన్న లక్ష్యంతో బీజేపీ ప్రచారానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈ నెల 28 న కరీంనగర్ లో  పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమ్మేళనం నిర్వహించనున్నారు. దానికి  కేంద్ర హోంమంత్రి అమిత్ షా చీఫ్ గెస్టుగా హాజరుకానున్నారు. అంతేగాక..వచ్చే నెల 5 నుంచి 14 వరకు పది రోజుల పాటు తెలంగాణలోని మొత్తం 17 పార్ల మెంట్ నియోజకవర్గాలు కవర్ అయ్యేలా యాత్రలు చేయాలని బీజేపీ నిర్ణయించింది.

రథయాత్రల పేరుతో బస్సు యాత్ర చేయాలనే నిర్ణయానికి పార్టీ రాష్ట్ర నాయకత్వ వచ్చింది. ఒక్కో రోజు రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ అయ్యేలా యాత్రలను ప్లాన్ చేస్తోంది. శుక్రవారం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ ఆధ్వర్యంలో కొందరు ఆఫీసు బేరర్లు పార్టీ స్టేట్ఆఫీసులో సమావేశమయ్యారు.  యాత్రలకు సంబంధించిన ప్లాన్ ను సిద్ధం చేశారు. రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాలను ఐదు క్లస్టర్లుగా విభజించారు. ఒక్కో క్లస్టర్ లో 3 నుంచి 4 లోక్ సభ నియోజకవర్గాలను చేర్చారు. వాటికి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇన్ చార్జ్ గా వ్యవహరిస్తున్నారు. ఒకే రోజున ఐదు క్లస్టర్లలో  యాత్రలను ప్రారంభించేలా బీజేపీ రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేస్తోంది. దీన్ని జాతీయ నాయకత్వం ఆమోదం కోసం పంపించారు.