గోవా పంచాయతీ ఉపఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ

గోవా పంచాయతీ  ఉపఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ

గోవాలోని మూడు జిల్లా పంచాయతీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విజయం సాధించింది. దావోర్లిమ్, రీస్ మాగోస్, కోర్టాలిమ్ జిల్లా పరిషత్ నియోజకవర్గాలకు ఆదివారం ఉప ఎన్నికలు జరగగా, మంగళవారం ఓట్ల లెక్కింపు జరిగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపిన వివరాల  ప్రకారం.. బీజేపీ అభ్యర్థులు పరేష్ నాయక్ (దావోర్లిమ్), సందీప్ కాశీనాథ్ బందోద్కర్ (రీస్-మాగోస్), బీజేపీ మద్దతు ఉన్న ఇండిపెండెంట్ మెర్సియానా మెండెస్ ఇ వాజ్ (కోర్టాలిమ్) విజయం సాధించారు. 

కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన గోవా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయా జిల్లా పంచాయతీ సభ్యులు రాజీనామా చేయడంతో ఈ పంచాయతీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాగా, జిల్లా పంచాయతీ ఉప ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించిన గోవా ప్రజలకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కృతజ్ఞతలు తెలిపారు.