
హైదరాబాద్, వెలుగు: అంబానీ, అదానీల కోసమే బీజేపీ పనిచేస్తుందని, తమ పార్టీ మాత్రం పేదల గురించే ఆలోచిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. లోక్ సభ ఎన్నికల ఆరో విడత ప్రచారంలో భాగంగా పంజాబ్ లోని ఫరీద్ కోట్ లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి తరపున భట్టి గురువారం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ సంపద ఇక్కడి ప్రజలకే దక్కాలని మల్లిఖార్జున్ ఖర్గే నాయకత్వంలో యువ నేత రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని అన్నారు.
కానీ, దేశంలోని ఆస్తులను, వ్యవస్థలను అమ్మి కొద్ది మందికి కట్టబెట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. మల్టీ నేషనల్ కంపెనీలకు మేలు చేసేందుకే బీజేపీ కట్టుబడి ఉందని విమర్శించారు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా ఇంటి పెద్ద బ్యాంకు ఖాతాలో రూ.లక్ష నగదు జమచేస్తామన్నారు. ప్రాణాలు లెక్క చేయకుండా దేశ సరిహద్దుల్లో కాపలాకాస్తున్న వీర జవాన్ల స్థాయిని మోదీ సర్కారు దిగజార్చిందని ధ్వజమెత్తారు. తమ కూటమి అధికారంలోకి రాగానే అగ్నివీర్ పథకాన్ని రద్దు చేస్తామని చెప్పారు.