బీజేపీ, ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్,ఈసీ కలిసి ఓట్ చోరీ...‘దేశద్రోహానికి’ పాల్పడ్డాయని రాహుల్ గాంధీ ఫైర్‌‌‌‌‌‌‌‌

బీజేపీ, ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్,ఈసీ కలిసి  ఓట్ చోరీ...‘దేశద్రోహానికి’ పాల్పడ్డాయని రాహుల్ గాంధీ ఫైర్‌‌‌‌‌‌‌‌
  • కేంద్ర ఎన్నికల సంఘం గుట్టురట్టు.. కమిషనర్ల మధ్య బయటపడ్డ విభేదాలు 
  • రాజ్యాంగ వ్యతిరేక పనులకు పాల్పడిన ఏ ఒక్క అధికారి కూడా తప్పించుకోలేడని కామెంట్‌‌‌‌

న్యూఢిల్లీ: ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ (సర్‌‌‌‌)లో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌‌‌‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఓట్ల దొంగతనం అనేది భారత ప్రజలపై జరిగిన దాడి మాత్రమే కాదని.. రాజ్యాంగంపై జరిగిన ప్రత్యక్ష దాడి అని  పేర్కొన్నారు. ఈ కుట్రను నడిపించిన బీజేపీ, ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్, కేంద్ర ఎన్నికల సంఘం ‘దేశద్రోహానికి’ పాల్పడ్డాయని  సంచలన వ్యాఖ్యలు చేశారు. బాధ్యులకు న్యాయపరంగా తగిన శాస్తి జరుగుతుందని స్పష్టం చేశారు. 

ఎన్నికల సంఘంలో తీసుకుంటున్న నిర్ణయాలపై ఇద్దరు కమిషనర్లు సుఖ్‌‌‌‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి  తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు ఓ ఆంగ్ల దినపత్రిక కథనం వెల్లడించిన నేపథ్యంలో రాహుల్ గాంధీ ‘ఎక్స్’  వేదికగా స్పందించారు. 

 ‘సర్‌‌‌‌‌‌‌‌’ ప్రక్రియలో తమకు సమాచారం లేకుండా నిర్ణయాలు తీసుకోవడంపై గత 10  నెలల్లో ఆ ఇద్దరు కమిషనర్లు రికార్డుల్లో ఏకంగా పద్నాలుగుసార్లు అభ్యంతరం తెలిపారని, ఒకేరోజు నాలుగు సార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయని ఆ కథనం పేర్కొందన్నారు.

ఓట్ల దొంగతనం దేశద్రోహమే 

దేశంలో ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ఎన్నికల వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టించిందని రాహుల్‌‌‌‌గాంధీ ఫైర్‌‌‌‌‌‌‌‌ అయ్యారు. గతంలో ఎన్నికల సంఘం అధికారులను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియోను ఈ సందర్భంగా పంచుకున్నారు. నిబంధనలను కాలరాస్తూ రాజ్యాంగ వ్యతిరేక పనులకు పాల్పడే ఏ ఒక్క అధికారి కూడా తప్పించుకోలేరని అన్నారు. ఇది దేశద్రోహంతో సమానమని ఆయన హెచ్చరించారు.

సీఈసీపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు

మరోవైపు, కాంగ్రెస్ పార్టీ సైతం ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌‌‌‌పై తీవ్ర విమర్శలు చేసింది.  పాలకుల ఆదేశాలకు అనుగుణంగా సీఈసీ పనిచేస్తున్నారని మండిపడింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ ఆదేశాలకు తగ్గట్టుగా ఈసీ నడుచుకుంటున్నదని, స్వతంత్ర సంస్థను మోదీ సర్కారు తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నదని ఆరోపించింది.  అయితే, ప్రతిపక్షాలు చేస్తున్న ఈ ఆరోపణలను బీజేపీ, ఎన్నికల సంఘం పూర్తిగా తోసిపుచ్చాయి. ఓటర్ల జాబితా సవరణ పారదర్శకంగానే సాగుతోందని పేర్కొన్నాయి.