రెండేండ్లుగా దర్యాప్తు.. ఎన్నికల ముందు నోటీసులా? : సీఎం కేజ్రీవాల్​

రెండేండ్లుగా దర్యాప్తు.. ఎన్నికల ముందు నోటీసులా? : సీఎం కేజ్రీవాల్​
  • బీజేపీపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్​ ఫైర్​
  • ఇది నిరాధారమైన కేసు.. ఒక్క ఆరోపణా రుజువుకాలే

న్యూఢిల్లీ: వచ్చే లోక్‌‌‌‌సభ ఎన్నికలలో ప్రచారం చేయకుండా అడ్డుకునేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తనను అరెస్టు చేయాలని చూస్తోందని ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. నిజాయితీనే తన ఆస్తి అని బీజేపీ దానిపై దెబ్బ కొట్టి తన ప్రతిష్టను దిగజార్చాలని భావిస్తోందని ఆరోపించారు. అందుకే రెండేండ్లుగా దర్యాప్తు జరుగుతున్న లిక్కర్ స్కామ్ కేసులో సరిగ్గా ఎన్నికల ముందు తనకు వరుసపెట్టి ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు వస్తున్నాయని చెప్పారు. బుధవారం ఎంక్వైరీకి రావాలని ఈడీ నోటీసులు ఇవ్వగా.. కేజ్రీవాల్ హాజరుకాలేదు. దీంతో ఆయన్ను అరెస్టు చేస్తారని ప్రచారం జరిగింది. ఆప్​ పార్టీ నేతలు బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో గురువారం ఢిల్లీలో కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. ‘ఢిల్లీ లిక్కర్​ స్కాం ఒక కల్పిత కేసు. తమకు నచ్చని వారిని జైలుకు పంపడం కోసం సృష్టించారు.  ఇందులో భాగంగా నిరాధార ఆరోపణలతో ఆప్ నేతలను లోపల వేశారు. ఇన్ని రోజులుగా దర్యాప్తు జరుగుతున్నా
ఏమీ రుజువుకాలేదు’ అని ఆరోపించారు.

ప్రతిష్ట దిగాజార్చే ప్రయత్నం

నిజాయితీయే తనకున్న పెద్ద ఆస్తి అని, నిరాధార ఆరోపణలతో నోటీసులు జారీ చేసి తన ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారని కేజ్రీవాల్ అన్నారు. “కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం ఎంక్వైరీ కాదు, నేను లోక్‌‌‌‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదు. అందుకే రెండేండ్లుగా దర్యాప్తు జరుగుతున్నా సరిగ్గా ఎన్నికల ముందు నాకు వరుసపెట్టి నోటీసులు ఇస్తున్నారు. గతంలో ఎందుకు నన్ను ఎంక్వైరీ కోసం పిలవలేదు” అని ప్రశ్నించారు. ‘‘ఈడీ నోటీసులు చట్టవిరుద్ధమని నా లాయర్లు చెప్పారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఈడీకి లేఖ రాశాను. ఈడీ నుంచి స్పందన లేదు. అక్రమంగా ఇచ్చే నోటీసులను ఫాలో కావాలా? చట్టబద్ధమైన నోటీసులు అయితే కచ్చితంగా వాటిని ఫాలో అవుతాను” అని అన్నారు. ఈడీ ఇప్పటి వరకు మూడు సార్లు నోటీసులను జారీ చేసినా కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు. అయితే 8 నెలల కింద సీబీఐ నోటీసులు ఇచ్చినప్పుడు సీబీఐ ముందు హాజరయ్యారు.