ఏడాదిన్నరలో బీజేపీ పీడ విరగడవుతది: మంత్రి మల్లారెడ్డి

ఏడాదిన్నరలో బీజేపీ పీడ విరగడవుతది: మంత్రి మల్లారెడ్డి

వనపర్తి, వెలుగు: మరో ఏడాదిన్నరలో దేశానికి బీజేపీ పీడ  విరగడ అవుతుందని, బీఆర్ఎస్ దేశంలో వివిధ పార్టీలతో కలిసి అధికారంలోకి వస్తుందని మంత్రి మల్లారెడ్డి చెప్పారు. సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ తరగతులు, ఐటీఐ కాలేజీ, ఇంజనీరింగ్ హాస్టల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బీసీ రెసిడెన్షియల్ వ్యవసాయ మహిళా డిగ్రీ కాలేజీని మంత్రులు నిరంజన్​రెడ్డి, సబితారెడ్డి, గంగుల కమలాకర్​తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ బీజేపీ పాలనతో జనం విసుగెత్తిపోయారని అన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు అన్నివర్గాల ప్రజలు ఆకర్షితులవుతున్నారని, బీఆర్ఎస్ దేశంలో అధికారం చేపడుతుందన్నారు. 

మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ వనపర్తిలో దేశంలోనే తొలిసారి మహిళా డిగ్రీ కాలేజీలో వ్యవసాయ కోర్సు ప్రవేశపెట్టిన ఘనత మంత్రి నిరంజన్ రెడ్డిదేనన్నారు. ప్రస్తుతం విద్యావ్యవస్థలో మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందని, ఇంటర్, డిగ్రీలో డిమాండ్ ఉన్న కోర్సులను ప్రవేశ పెట్టబోతున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ పోతుగంటి రాములు, జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హన్మంతు, బీసీ గురుకులాల కార్యదర్శి మల్లయ్యభట్టు తదితరులు పాల్గొన్నారు.